మంగళగిరిలో తనయుడు గెలుపుపై చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు

మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ గెలుపుపై సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్ గెలుపుపై తొలిసారి చంద్రబాబు స్పందించారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రారంభించారు. గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు పింఛన్లు స్వయంగా సీఎం చంద్రబాబు అందజేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన సభలో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ సహా పలువురు పాల్గొన్నారు.

ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ..

గత ఎన్నికల్లో లోకేష్‌ ఓడినా మళ్లీ మంగళగిరి నుంచే పోటీ చేశారన్నారు. ప్రజలందరి అభిమానం చూరగొని లోకేష్‌ ఇక్కడి నుంచి పోటీ చేసి అఖండ మెజార్టీతో గెలిచారన్నారు. గాజువాక, భీమిలితో పాటు మంగళగిరిలోనూ 90వేలకు పైగా మెజారిటీ వచ్చిందన్నారు. కుప్పం లో 60వేలు మెజారిటీ వస్తే గొప్ప మెజారిటీ అనుకునేవాడినని.. 39 ఏళ్ల తర్వాత మంగళగిరి లో తెలుగుదేశాన్ని గెలిపించటమే కాకుండా లోకేష్‌కు 92వేల మెజారిటీ కట్టబెట్టారన్నారు.

మునుపెన్నడూ మంగళగిరిలో ఏ ఎమ్మెల్యేకి రాని మెజారిటీ లోకేష్‌కే వచ్చిందని చంద్రబాబు అన్నారు. లోకేష్‌తో ఇంకా బాగా పనిచేయించుకోండి అంటూ ప్రజలకు చంద్రబాబు తెలిపారు. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలేనని అన్నారు. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగాలని అందరూ ఆలోచిస్తున్నారన్నారు. వైసీపీ హయాంలో ఐదేళ్లపాటు ప్రజలను అణగదొక్కారన్నారు. నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందనే ఆనందంలో ప్రజలు ఉన్నారని చంద్రబాబు అన్నారు.