చిన్నారులపై లైంగిక వేధింపులు..56 ప్రదేశాల్లో సీబీఐ సోదాలు

ఆపరేషన్ మేఘ చక్ర పేరిట భారీ ఆపరేషన్ 

CBI raids
CBI raids

న్యూఢిల్లీః ఆన్‌లైన్‌లో చిన్నారులపై లైంగిక వేధింపులకు సంబంధించిన వీడియోలు, చైల్డ్ ఫోర్నోగ్రఫీపై సీబీఐ ఉక్కుపాదం మోపుతోంది. ఆన్‌లైన్‌లో ఇలాంటి వీడియోలు అప్ లోడ్ చేసే వాళ్ల ఆటకట్టించేందుకు ‘ఆపరేషన్ మేఘ చక్ర’ ఏర్పాటు చేసింది. ఇలాంటి రెండు కేసులకు సంబంధించి సీబీఐ అధికారులు 20 రాష్ట్రాల్లోని 56 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. న్యూజిలాండ్‌లోని ఇంటర్‌పోల్ యూనిట్ సింగూపూర్ అందించిన సమాచారం ఆధారంగా ఈ శోధనలు జరిగినట్టు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్‌లో లభ్యమయ్యే పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్‌ (సీఎస్ఏఎమ్)ను అరికట్టే చర్యల్లో సీబీఐ చేస్తున్న అతిపెద్ద ఆపరేషన్ ఇది. సింగపూర్ ఇంటర్‌పోల్ నుంచి ఇన్‌పుట్స్, క్లౌడ్ స్టోరేజీని ఉపయోగించి ఇంటర్నెట్‌లో సీఎస్ఏఎమ్ పెడ్లర్లకు వ్యతిరేకంగా గత సంవత్సరం నిర్వహించిన ఆపరేషన్ కార్బన్ సమయంలో లభించిన సమాచారంగా ఈ శోధనలు జరిగాయి.

ఆన్‌లైన్‌లో పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్ ను వ్యాప్తి చేసే వ్యక్తులు, ముఠాలు వాటి ద్వారా మైనర్లను లైంగికంగా, శారీరకంగా బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఈ రాకెట్లు వ్యక్తిగతంగా, వ్యవస్థీకృత స్థాయిలో పనిచేస్తాయి. అలాంటి వాళ్లను గుర్తించి, పట్టుకోవడం కోసం ఆపరేషన్ మేఘ చక్ర పేరిట సీబీఐ దాడులు చేస్తోంది. మైనర్‌లతో అక్రమ లైంగిక కార్యకలాపాల ఆడియో-విజువల్స్‌ను ప్రసారం చేయడానికి పెడ్లర్లు ఉపయోగించే క్లౌడ్ స్టోరేజీ సౌకర్యాలను గుర్తించడం లక్ష్యంగా పెట్టుకొని ఈ ఆపరేషన్ ‘మేఘ చక్ర’ పని చేస్తోంది. ప్రత్యేక సైబర్ క్రైమ్ విభాగాన్ని ఏర్పాటు చేసిన సీబీఐ భారతదేశం అంతటా సీఎస్ ఏఎమ్ పెడ్లర్లను దెబ్బతీసింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/