మరికాసేపట్లో ఎమ్మెల్సీ కవిత ఇంటికి సీబీఐ అధికారులు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ను ఈరోజు సీబీఐ అధికారులు విచారించనున్నారు. హైదరాబాద్​ బంజారాహిల్స్‌‌‌‌లోని ఆమె ఇంట్లో స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే 160 సీఆర్‌‌‌‌‌‌‌‌పీసీ కింద నోటీసులు ఇచ్చారు. కవిత చెప్పిన విధంగానే ఆదివారం స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ చేసేందుకు వస్తామని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఉదయం 11 గంటలకు సీబీఐ అధికారుల స్పెషల్‌‌‌‌ టీమ్‌‌‌‌ కవిత ఇంటికి చేరుకోనుంది.

కేంద్ర బలగాల పర్యవేక్షణలో సీబీఐ వివరణ తీసుకోనుంది. ఈ నేపథ్యంలోనే శనివారం కవిత కేసీఆర్‌ను కలుసుకున్నారు. వీరి మధ్య ఏ అంశాలపై చర్చ జరిగిందనేది ఆసక్తిగా మారింది. ఇదిలా ఉంటే సీబీఐ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఏర్పాటైన ఫ్లెక్సీలు ఆసక్తిగా మారాయి. ‘డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌ విల్‌ నెవర్‌ ఫియర్‌’ అంటూ ఫ్లెక్సీలను టీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాటు చేశారు. వీరుని కుమార్తె ఎప్పటికీ భయపడదు అనే క్యాప్షన్ తో వెలసిన బ్యానర్లు హల్ చల్ చేస్తున్నాయి.

మహిళా అధికారుల సమక్షంలోనే కవిత స్టేట్‌‌‌‌మెంట్‌‌‌‌ రికార్డ్ చేయనున్నారు. ఆమె అంగీకారంతో వీడియో రికార్డింగ్ చేయనున్నారు. నిందితులైన బోయిన్‌‌‌‌పల్లి అభిషేక్‌‌‌‌రావు, అరుణ్‌‌‌‌ రామచంద్ర పిళ్లై, ఇండో స్పిరిట్ ఎండీ సమీర్‌‌‌‌‌‌‌‌ మహేంద్రు స్టేట్‌‌‌‌మెంట్ల ఆధారంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. సీబీఐ విచారణ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కవిత ఇంటికి వస్తారనే సమాచారంతో పోలీసులు అక్కడి పరిసరాల్లో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.