వివేకా హత్యకేసులో కడప ఎంపీ అవినాష్ కు సీబీఐ నోటీసులు

వైస్సార్సీపీ నేత , మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ తాజాగా కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. వివేకా హత్య కేసుకు సంబంధించి రేపు హైదరాబాద్ సిబిఐ ఆఫీసులో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. మధ్యాహ్నం 3 గంటలకు తమ ఎదుట హాజరవ్వాలని సీబీఐ స్పష్టం చేసింది.

ఈ నోటీసుల ఫై అవినాష్ స్పందించారు. సీబీఐ విచారణకు అన్ని విధాలా సహకరిస్తానని వెల్లడించారు. అయితే, పులివెందులలో బిజీ షెడ్యూల్ ఉన్నందున రేపు విచారణకు రాలేనని తెలియజేశారు. విచారణకు మరో తేదీ తెలియజేయాలని కోరారు. ఈ మేరకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

వివేకానంద రెడ్డి హత్య రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ హత్య అనంతరం కేసు అనేక మలుపులు తిరిగింది. వివేకా కుమార్తే డాక్టర్ సునీత సుప్రీం కోర్టు తలుపులు తట్టింది. ఆ తర్వాత దీన్ని తెలంగాణకు బదిలీ చేస్తూ.. న్యాయస్థానం నిర్ణయం తీసుకుంది. దీంతో కేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసును విచారిస్తోన్న కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అధికారులు..సోమవారం కడప జిల్లా పులివెందులకు వచ్చారు. సుమారు గంటపాటు అక్కడే గడిపారు. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటోన్న వారి గురించి ఆరా తీశారు. వారి కుటుంబ నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు.