సబితా ఇంద్రారెడ్డి, ధర్మానకు సీబీఐ సమన్లు

జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు సమన్లు జారీ

Sabitha-Dharmana-cbi
Sabitha-Dharmana-cbi

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఏపి మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మితో పాటు రిటైర్డ్ అధికారులకు ఏపి సిఎం జగన్‌ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్ కు భూముల కేటాయింపు వ్యవహారంలో అవకతవకల విషయమై దాఖలైన అనుబంధ ఛార్జిషీట్ ను సీబీఐ న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా రిటైర్డ్ అధికారులు శామ్యూల్, వీడీ రాజగోపాల్, డీఆర్వో సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మకు సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 17న నిందితులు హాజరు కావాలని ఆదేశించింది.

కాగా, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు ఉన్నారు. వీరితో పాటు ఆయా అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ అనుబంధ ఛార్జిషీట్ ను దాఖలు చేసింది. ఈ ఛార్జిషీట్ ను స్వీకరించవద్దంటూ జగన్ సహా నిందితుల తరఫు న్యాయవాదులు వాదించినప్పటికి ఫలితం దక్కలేదు. మరిన్ని వివరాల ఆధారంగా అనుబంధ ఛార్జిషీట్ దాఖలు చేశామని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. ఇదిలా ఉండగా, ఈ కేసు వ్యవహారమై రెండేళ్ల క్రితమే సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. అయితే, దీనిపై హైకోర్టు స్టే విధించింది. దీనిపై ఉన్న స్టే ను హైకోర్టు తాజాగా తొలగించడంతో దానిపై మళ్లీ ఈరోజు సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/