మారుతి మాజీ ఎండీపై సీబీఐ కేసు!

Jagdish Khattar
Jagdish Khattar

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంకు(పీఎన్‌బీ)లో మళ్లీ మరో స్కాం వెలుగు చూసింది. ఈసారి కుంభకోణం విలువ రూ.110 కోట్లు. ఇందులో మారుతి ఉద్యోగ్ మాజీ ఎండీ జగదీష్ ఖట్టర్ ఇరుక్కున్నారు. ఈ మేరకు ఆయనపై కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) కేసు నమోదు చేసింది. ఈ మోసానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. జగదీష్ ఖట్టర్ కార్‌నేషన్ ఆటో ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌ను ప్రారంభించారు. 2009లో ఈ కంపెనీ కోసం ఆయన పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.170 కోట్లు రుణం తీసుకున్నారు. ఈ రుణానికి సంబంధించి 2012 వరకు కొంత మొత్తం చెల్లించారు కానీ ఇంకా రూ.110 కోట్లు బ్యాంక్‌కు చెల్లించాల్సి ఉంది. తమ బ్యాంకులో రుణం తీసుకుని చెల్లించకుండా ఎగవేశారంటూ జగదీష్ ఖట్టర్, ఆయన కంపెనీ కార్‌నేషన్‌లపై పంజాబ్ నేషనల్ బ్యాంకు ఫిర్యాదు చేయడంతో సీబీఐ రంగంలోకి దిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంకులో రుణం తీసుకునేటప్పుడు కార్‌నేషన్, జగదీష్ ఖట్టర్.. తనఖాగా పెట్టిన ఆస్తులను ఆ తరువాత అనధికారికంగా, అనుమతి లేకుండానే అమ్మేసినట్లు, ఆ నిధులను ఆయన దారి మళ్లించినట్లు సీబీఐ గ్రహించింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/