అశోక్‌గజపతిరాజుపై కేసు నమోదు..

మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు పై కేసు నమోదు చేసారు పోలీసులు. బుధువారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలోని రామాలయ నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమానికి, అలాగే విధులకు ఆటంకం కలిగించారని అశోక్ గజపతిరాజు పై ఆలయ ఈవో ప్రసాద్ ఫిర్యాదు చేశారు. ఈవో ప్రసాద్ ఫిర్యాదు మేరకు… 473,353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు నెల్లిమర్ల పోలీసులు. తనకు సమాచారం లేకుండా బోడికొండపై రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని నిర్ణయం తీసుకోవడంపై దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతిరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో దేవదాయ శాఖ అధికారులపై, అధికార పక్షంపైనా తీవ్రంగా మండిపడి.. స్టీలు రేకు శిలాఫలకాన్ని విసిరేశారు. దీంతో ఆయనకు, వైసీపీ నాయకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఒకానొక దశలో కొండపై గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ వ్యవహారం అంతా బుధవారం హాట్ టాపిక్‌గానే నడిచింది. మరోవైపు ఈ ఘటనలో అశోక్‌ గజపతి రాజుపై మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్‌, బొత్స సత్యనారయణపై విమర్శలు గుప్పించారు. అయితే రామతీర్థం ఘటనపై తెదేపా అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అశోక్ గజపతిరాజుపై మంత్రులు దాడికి తెగించారని మండిపడ్డారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అశోక్ గజపతిరాజుపై కక్షగట్టారని ఆరోపించారు. వైకాపా అరాచకాలు ఎల్లకాలం సాగబోవని చంద్రబాబు హెచ్చరించారు.