తెలంగాణలో కరోనా.. క్లీనింగ్ పనులు

సికింద్రాబాద్ మహేంద్రహిల్స్‌లో.. కరోనా వైరస్ సోకిన యువకుడు ఇల్లు ఉన్న పరిసరాల్లో క్లీనింగ్ 

Coronavirus in Telangana
Coronavirus in Telangana

హైదరాబాద్‌: తెలంగాణకు చెందిన యువకుడికి కరోనా వైరస్ సోకడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా వైరస్ సోకిన యువకుడు ఇల్లు ఉన్న ప్రాంతాల్లో క్లీనింగ్ పనులను మొదలుపెట్టారు. మహేంద్ర హిల్స్‌లోని అతడి నివాసంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో బ్లీచింగ్ చేస్తున్నారు. కరోనా వైరస్ సోకిన యువకుడిది మహేంద్రహిల్స్ అని ప్రభుత్వం వెల్లడించడంతో… ఆ ప్రాంత ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఆ ప్రాంతానికి చెందిన కొందరు ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

నగరంలో ఒక కరోనా పాజిటివ్‌ కేసు బయటపడిన నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. గాంధీ, ఫీవర్‌ ఆస్పత్రుల్లో కరోనా వైరస్‌ ప్రత్యేక వార్డులతో పాటు అత్యవసర చికిత్స వార్డులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. గాంధీలో 40, ఫీవర్‌లో 40, చెస్ట్‌ ఆస్పత్రిలో 10 పడకలను ఏర్పాటు చేశారు. గాంధీ ఆస్పత్రిలో 7వ అంతస్తులో కరోనా వైరస్‌ ఐసోలేటెడ్‌ వార్డు, అత్యవసర విభాగంలో అక్యూట్‌ ఎమర్జెన్సీ కరోనా వైరస్‌ వార్డు పేరిట వార్డులు సిద్ధం చేశారు. ప్రస్తుతం వైరస్‌ సోకిన వ్యక్తిని ఏడో అంతస్తులోని వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/