రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోరం : వాగులో కొట్టుకుపోయిన కారు ఇద్దరు మృతి

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరోసారి వర్షాలు దంచికొడుతున్నాయి. గత మూడు రోజులుగా అనేక జిలాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండడం తో వాగులు వంకలు ఉప్పొంగిప్రవహిస్తున్నాయి. దీంతో చాల ఊర్లకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వాగు దాటుతున్న క్రమంలో కారు వాగు ఉధృతిలో కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా…మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే..

వేములవాడ రూరల్ మండలం ఫాజుల్‌నగర్ వద్ద వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. చల్‌గల్‌ గ్రామానికి చెందిన నరేష్ తన అమ్మ, మేనల్లుడితో కలిసి హైదరాబాద్‌కు కారులో బయలుదేరారు. ఈ క్రమంలో.. వేములవాడ మండలంలోని ఫాజుల్‌నగర్‌కు చేరుకున్నారు. గ్రామం వద్ద ఉన్న వాగు రహదారిపై నుంచి ప్రవహిస్తోంది. వరద ప్రవాహాన్ని అంచనా వేయలేకపోయిన డ్రైవర్.. కారును అలాగే పోనిచ్చాడు. వాగు ప్రవాహాన్ని తట్టుకోలేక కారు నీటిలో కొట్టుకుపోయింది. కారు కొట్టుకుపోవటాన్ని గమనించిన స్థానికులు.. హుటాహుటిన స్పందించి ప్రయాణికులను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ.. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు చింటుతో పాటు చిన్నారి అమ్మమ్మ గంగ(45) అప్పటికే మృతి చెందారు. డ్రైవర్ రిజ్వాన్‌తో పాటు చిన్నారి మేనమామ నరేష్‌ను స్థానికులు ప్రాణాలతో కాపాడారు.