అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

అనంతపురం జిల్లా విడపనకల్లు మండలం దొనేకల్‌ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బ్రిడ్జి నిర్మాణం కోసం తీసిన గుంతలో కారు పడిపోయింది. క్రేన్ సహాయంతో కారును బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. చీకటి పడడంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. కారులో ఐదుగురు ఉన్నట్లు సమాచారం. కారు గుంతకల్లు నుంచి బళ్లారి వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

దాదాపు 30 నుంచి 40 అడుగుల లోతులో కారు పడిపోయినట్లు అక్కడి స్థానికులు చెపుతున్నారు. విషయం తెలుసుకున్న గుంతకల్‌ డీఎస్పీ నర్సింగప్ప, విడపనకల్లు ఎస్సై గోపాలుడు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు, క్రేన్‌సాయంతో కారును బయటికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.దొనేకల్‌, కడగరబింకి గ్రామస్థులు సైతం భారీగా తరలివచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వద్ద ఎలాంటి హెచ్చరిక బోర్డులు లేకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తున్నారు.