విఐపి సంస్కృతిని నియంత్రించలేమా?

VIP security (file)

రాజ్యాలు అంతరించినా రాజులుపోయి నా అవశేషాలు ఎంతో కొంత ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో ఈ రాజరికపు వ్యవస్థకు చోటు లేకపోయినా దాని స్థానంలో వచ్చిన విఐపి సంస్కృతి అంతకంతకు పెరిగి అటు సాధారణ ప్రజలతో పాటు, ఇటు అధికార వర్గాలను కూడా ఇబ్బందికి గురిచేస్తున్నది. పదవ్ఞలు పెరిగే కొద్దీ నేతలకు భద్రత పేరుతో కల్పిస్తున్న సిబ్బంది, వాహనాలు హడావ్ఞడి రాజరికపు వ్యవస్థను గుర్తు చేస్తూనే ఉంది.కీలకపదవ్ఞల్లో ఉన్న నేతలకు భద్రత కల్పించాల్సిందే. అందులో మరో అభిప్రాయానికి తావ్ఞ లేదు. కానీ అదే సమయంలో ఆ భద్రత ఇతరులకు ముఖ్యంగా సామాన్యులకు ఇబ్బంది కాకూడదు.దేశంలో కానీ, రాష్ట్రాల్లో కానీ ప్రజాప్రభువ్ఞలు పెరిగిపోయారు. అందులో కొందరికి తమకో ప్రత్యేకత ఉండాలనే కోరిక రానురాను పెరిగిపోతున్నది. దాంతో భద్రత కోసం ఇచ్చిన సిబ్బందిని కొందరు నేతలు హోదాగా ఉపయో గించుకుంటున్నారు. ముఖ్యంగా పోలీసులకు ఈ విఐపి పెద్దలకు భద్రత కల్పించడం పెద్ద సమస్యగా మారిపోతు న్నది. భద్రత విషయంలో ఎలాంటి చిన్న పొరపాటు చేసినా ఉద్యోగానికి ముప్పు వస్తుందనే భయం వారిలో ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటున్నది.. దీంతో ఇప్పటికే పెరిగిపోయిన విధులను పక్కకు పెట్టయినా విఐపి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. విఐపి అనేది కొందరికి ఒక స్టేటస్‌ సింబల్‌గా మారిపోయింది. దీనిని తగ్గించేందుకు మోడీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కొంత ప్రయత్నాలు ప్రారంభించింది. 2017లోనే ఎర్రబుగ్గ, నీలి బుగ్గ పెట్టుకోవడానికి వీలు కల్పించే నిబంధనలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉన్నతస్థాయి పదవ్ఞల్లో ఉన్నవారు సైతం వీటిని పెట్టుకోరాదని ఆమోదించారు. అత్యవసర సేవలు అందించే అంబులెన్సులు, అగ్ని మాపక వాహనాలు, పోలీసు వాహనాలు లాంటి వాటికి మాత్రమే నీలిదీపాన్ని వాడేందుకు మినహాయింపు ఇచ్చారు.

ఎర్రదీపం, నీలి దీపం తొలగింపునకు వీలుగా కేంద్ర మోటారు వాహనాల నిబంధనను సవరణ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆనాటి ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఉన్నతస్థాయిలో ఉన్న కొందరు వ్యక్తులు వాడే వాహనాలపై ఈ బుగ్గలు ఏర్పర్చడానికి వీలులేదని, సైరన్‌లు కూడా రద్దు చేస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖమంత్రి ఆనాడే ప్రకటించారు. ముఖ్యంగా విఐపిల రాకపోకలు పెరిగిపోవడంతో ట్రాఫిక్‌ సమస్య జఠిలంగా మారు తున్నది.

ఇక గుళ్లు గోపురాల్లో దర్శనాలు, ఒకటేమేమిటి అన్నింట్లోనూ సామాన్యులకు ఇబ్బందులు ఎదురౌ తున్నాయి, బుగ్గ కార్లే కాదు విఐపిల సంస్కృతి వెట్టిచాకిరి అద్దంపడుతూ ఆర్డర్లీ వ్యవస్థ కూడా నేటికీ కొనసాగడం దురదృష్టకరం. ముఖ్యంగా పోలీసు శాఖలో దశాబ్దాల తరబడి సాగుతున్న ఈ వెట్టిచాకిరిని అంత మొందించేందుకు ఎన్నిసార్లు ప్రయత్నాలు చేస్తున్నా అది ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉంది.

ఆర్డర్లీ వ్యవస్థ అన్నా మరో పేరుతో పిలిచినా బ్రిటిష్‌ కాలం నాటి ఈ దుస్సంప్రదాయాన్ని నేటికీ పారద్రోలేకపోతు న్నారు. గతంలో ఈ విషయం ఎన్నోసార్లు పాలకుల దృష్టికి వచ్చినా 1979లో ఆనాటి ముఖ్యమంత్రి చెన్నా రెడ్డి ఈ విషయాన్ని పరిగణించి ఈ వ్యవస్థను రద్దు చేస్తూ సెప్టెంబరు 19న జివోనెం.612 ద్వారా ఉత్తర్వులు జారీచేశారు. ప్రత్యామ్నాయంగా ఈ ఆర్డర్లీ వ్యవస్థను ఉపయోగించుకుంటున్న అధికారులకు కాంపెన్సేటరీ అలవెన్సుకింద 120 రూపాయల నుంచి 250 రూపా యల వరకు అదనంగా చెల్లించాలని ఆదేశించారు. అయితే ఒకటి, రెండు నెలలు తాత్కాలికంగా ఈ వ్యవస్థ ఆగిపోయినా ఆ తర్వాత యధావిధిగా కొనసాగించారు. అటు ప్రభుత్వం ఇచ్చే కాంపెన్సేటరీ అలవెన్సు తీసుకుం టూనే మరోపక్క ఆర్డర్లీ వ్యవస్థను కొనసాగించుకోవడంతో అటు డబ్బుపోతున్నది, ఇటు ఆ వ్యవస్థను నియంత్రించ లేకపోవడంతో 1988 అక్టోబరు 31న కాంపెన్సేటరీ అలవెన్సును నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

అలవెన్సు రద్దు కావడంతో వారు నియమించుకునేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లయింది.దీంతో ఈ వ్యవస్థవల్ల ముఖ్యంగా పోలీసు శాఖలోని హోంగార్డులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే విషయం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి దృష్టికి రావడంతో ఆయన తీవ్రంగా స్పందించి రద్దుకు చర్యలు తీసుకున్నట్లు ప్రకటించారు. అలా ఎన్నోసార్లు పాలకులు పదేపదే ప్రకటించినా, అధికారులను హెచ్చరించినా ఆర్డర్లీ వ్యవస్థ మాత్రం దూరం కాలేదు.

అప్పుడప్పుడు అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు మాత్రం ఆర్డర్లీగా పనిచేస్తున్నవారు తమ గోడును వెల్లబోసుకున్నప్పుడు పెద్దపెద్ద ప్రకటనలు ఇచ్చి చర్యలు తీసుకున్నట్లు నటించి తర్వాత మరిచిపోతున్నారు. గతంలో అంతగా చదువ్ఞ కున్నవారు ఈ హోంగార్డులు, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు రావడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు. నిరుద్యోగ రక్కసి ప్రబలి జీవనాధారం లేక మరో దిక్కులేక ఇదే పదివేలు అనుకుంటూ హోంగార్డు ఉద్యోగాలకు డిగ్రీ, పోస్టుగ్రాడ్యు యేషన్‌ చదివిన వారు కూడా క్యూ కడుతున్నారు. అటువంటి వారితో ఇంటిపనులు చేయించడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆలోచించాలి. రక్షణకోసం పెట్టిన ఈ కానిస్టే బుల్స్‌ ఏళ్లతరబడి ఒకే చోట ఉండిపోవడంతో తుపాకి వాడే పద్ధతులను,విధానాలను మరిచిపోయి అటెండర్లుగా కొనసాగుతున్నారు. మొత్తంమీద ఆర్డర్లీ పేరుతోనో, మరో పేరుతోనో రక్షణ పేరుతోనో ఈ సిబ్బందిని తమ స్టేటస్‌ను చూపించుకునేందుకు కొందరు వాడుకోవడం దురదృష్టకరం. అలాగే ఆర్డర్లీగా పనిచేసే వారికి అందరిలాగానే ఆత్మగౌరవం ఉంటుంది. దానికిభంగం కలిగించకుండా అవకాశం కల్పించాల్సిన బాధ్యత పాలకుల కనీస కర్తవ్యం.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/