పుతిన్‌పై నిషేధం విదించనున్న కెనడా !

ఒట్టావా: ఉక్రెయిన్‌పై రష్యా దాడి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక పరమైన అంశాలపై నియంత్రణలు విధించిన కెనడా.. తాజాగా ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌పై ఆంక్షలు విధించడానికి సిద్ధమైంది. పుతిన్‌తోపాటు రష్యాకు చెందిన వెయ్యి మంది కెనడాలోకి ప్రవేషించకుండా నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును సెనెట్‌లో ప్రవేశపెట్టింది. ఈ బిల్లు ఆమోదం పొందినట్లయితే పుతిన్‌తోపాటు అతని ప్రభుత్వంలోని అధికారులు, మిలటరీ పెద్దలు కెనడాలోకి ప్రవేశించడానికి వీలుండదు. ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా దాడికి దిగిన పుతిన్‌తోపాటు అతనికి మద్ధతుగా నిలిచిన ముఖ్యమైన వ్యక్తులు కెనడాలోకి రావడానికి వీళ్లేకుండా బ్యాన్‌ చేస్తున్నామని ఆ దేశ ప్రజా భద్రత మంత్రి మార్కో మెడిసినో తెలిపారు.

కాగా, ఉక్రెయిన్‌పై రష్యా బలగాలు క్రమంగా పట్టుబిగిస్తున్నాయి. డాన్‌బాస్‌లోని కీలక ప్రాంతాల్లో పుతిన్‌ సేనలు బాంబుల వర్షం కురిపిస్తున్నాయి. లుహాన్స్క్‌, డొనెట్స్క్‌లలో జరిపిన దాడుల్లో 20 మందికిపైగా మృతిచెందారు. లివీవ్‌ నగరం బాంబుల మోతతో దద్దరిల్లుతున్నది. మెరియుపోల్‌లో 260 మంది ఉక్రెయిన్‌ సైనులు రష్యన్‌ బలగాలకు లొంగిపోయారు. దీంతో ఓడరేవు పట్టణం దాదాపు రష్యా పరమైంది. లొంగిపోయిన వారందరని తమ నియంత్రణలో ఉన్న ప్రాంతాలకు తరలిస్తున్నారు.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/