ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టొచ్చు కదా?: రఘురామ

జిల్లాల ఏర్పాటు నిర్ణయాన్ని జగన్ ఏకపక్షంగా తీసుకున్నారు: రఘురామకృష్ణరాజు

అమరావతి: ప్రతి పథకానికి జగనన్న, వైయస్సార్ పేర్లు పెట్టే బదులు ఒక్క పథకానికైనా ఎన్టీఆర్ పేరు పెట్టొచ్చుకదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని వైస్సార్సీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు. ఒక జిల్లాకు ఎన్టీఆర్ పేరును పెట్టినంత మాత్రాన ఆ సామాజికవర్గం ఓట్లు వైస్సార్సీపీకి పడతాయా? అని ప్రశ్నించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై అసెంబ్లీలో చర్చించకుండా… మంత్రుల కాళ్లు కట్టేసి, ఎమ్మెల్యేల నోళ్లు నొక్కేసి సీఎం జగన్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు.

ఉద్యోగులను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విభజించి పాలిస్తున్నారని మండిపడ్డారు. ఏ అర్హత లేని సజ్జలకు ఉద్యోగ సంఘాలను బెదిరించే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు. కనీసం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా కాని సజ్జల అన్నీ తానై వ్యవహరిస్తూ.. తమ పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలపై పెత్తనం చెలాయిస్తున్నాడని దుయ్యబట్టారు. పరిధికి మించి సజ్జల వ్యవహరిస్తుండటంపై తమ పార్టీలోని ప్రజాప్రతినిధులు సైతం అసహ్యించుకుంటున్నారని అన్నారు. ‘నేను ఉన్నాను, నేను విన్నాను’ అని మాత్రమే తమ ముఖ్యమంత్రి జగన్ చెప్పారని… ‘సజ్జల ఉన్నాడు, సజ్జల వింటాడు, సజ్జల చేస్తాడు’ అని ఎప్పుడూ చెప్పలేదని సెటైర్ వేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/