నల్లధనాన్ని వెలికి తీయగలమా?

Black money (file)

ధనిక, పేదల మధ్య వ్యత్యాసం తగ్గించి సమసమాజాన్ని నిర్మించడమే ధ్యేయంగా ఎంతో కృషి చేస్తున్నామని, అందుకోసం లక్షలాది కోట్ల రూపాయలు వెచ్చిస్తు న్నట్లు పాలకులు పదేపదే చెప్పుకుంటున్నా ధనికులు మరింత లక్ష్మీపుత్రులుగా ఎదిగిపోతుంటే మరొకపక్క పేదరికంలో మగ్గేపేదల సంఖ్య కూడా పెరుగుతున్నది. భారతదేశం మొత్తం సంపదలో అధికశాతం కేవలం 57మంది గుప్పెట్లో చిక్కుకుపోయినట్లు అనేక నివేదికలు వెల్లడించాయి. స్వదేశంలో సొమ్ములు కూడబెట్టుకొని కోట్లకు కోట్లు పడగలెత్తి పన్నులు సైతం ఎగవేస్తూ ఆ సొమ్మునంతా విదేశాలలో భద్రతపర్చుకుంటున్న కొందరు ఘనుల చరిత్ర గురించి తెలిసినా భారత్‌ ఏమీ చేయలే కపోతున్నది. ఉత్తరప్రత్యుత్తరాలు, సమీక్షలు, సమావేశా లతో కాలం గడుపుతున్నారు తప్ప ఆ నల్లడబ్బును తీసుకువచ్చేందుకు నిర్మాణాత్మక, నిర్దిష్టమైన చర్యలు తీసుకోలేకపోతున్నారనే చెప్పొచ్చు. తాజాగా నిన్న మంగళవారం స్విస్‌ బ్యాంకు లో దాచుకున్న కొందరి పెద్దల వివరాలు కేంద్రప్రభుత్వా నికి అందినట్లు వార్తలు వచ్చాయి.

అందులో ఎవరెవరి పేర్లున్నాయనేవిషయంలో ఊహాగానాలు వెలువడుతున్నాయి. రాజకీయ నాయకులు కొందరు సినీప్రముఖులు, మరికొందరు బడా వ్యాపార వేత్తలు ఇలా ఎందరి పేర్లో అందులో ఉన్నట్లు చెప్తున్నా రు. అయితే ఆ పేర్లు బయటపెట్టేందుకు వీల్లేదనే నిబంధనతో స్విస్‌ బ్యాంకు అందచేసిందని చెప్తున్నారు. తర్వాత దశలవారీగా జాబితాలను అందిస్తుందని సమాచారం. ఈ నల్లధనాన్ని బయటకు తీసేందుకు గత రెండు మూడు దశాబ్దాలుగా ప్రయత్నాలు జరుగుతు న్నాయి. యుపిఎ ప్రభుత్వంలో కూడా ఇందుకు సంబంధించి కసరత్తు జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో తమ మేనిఫెస్టోలో సైతం నల్లధనం వెలికితీస్తామని రాజకీయ పార్టీలు స్పష్టం చేశాయి. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ నల్లధనం మూలుగుతున్నా ఇతర దేశాల తంతు ఎలా ఉన్నా ప్రత్యేకించి స్విట్జర్లాండ్‌ బ్యాంకులకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. స్విస్‌ బ్యాంకుల్లో నల్లధనాన్ని దాచుకునేందుకు చాలా మంది పెద్దలు ప్రయత్నిస్తుంటారు. సఫలీకృతం అవ్ఞతున్నారు. ఈ దేశంలోని బ్యాంకుల్లో వ్యక్తులు తమతమ సొమ్ము, విలువైన దస్త్రాలు, బంగారం, వజ్రాలు వంటి వాటిని డిపాజిట్‌ చేసుకునే సౌకర్యం ఉంది. ఈ వివరాలు అడిగినా ఇచ్చేందుకు ఆ చట్టాలు అంగీకరించవ్ఞ. తమ దేశ చట్టాలకు వ్యతిరేకమని, వ్యక్తుల గోప్యతకు ఇది భంగకరమని, దీనివల్ల తమ ఆర్థికవృద్ధికి విఘాతం కలుగుతుందని స్విస్‌ ప్రభుత్వం తమ విధానాన్ని సమర్థించుకుంటున్నది. అయితే ప్రముఖులకు సంబంధించిన ఖాతాల వివరాలు అందివ్వడంలో స్విట్జర్లాండ్‌ పూర్తిస్థాయిలో సహకరించడం లేదని, ఇదే విధానం కొనసాగిస్తే స్విట్జర్లాండ్‌ను సహాయనిరాకరణ దేశాల్లో చేర్చకతప్పదని కూడా భారత్‌ గతంలో హెచ్చరిం చింది.

గతంలో భారత్‌ స్విస్‌ బ్యాంకులో ఖాతాలున్నట్లు అనుమానిస్తున్న 592 మంది వ్యక్తులు, సంస్థల పేర్లను స్విట్జర్లాండ్‌కు పంపించి తమకు ఈ సమాచారం అందచేయాలని అభ్యర్థించింది. దీనిపై ఎన్నో ఉత్తరప్రత్యు త్తరాలు జరుగుతున్నాయి. అధికారికంగా ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధులతో కూడా చర్యలు జరిగాయి. ఎట్టకేలకు ఒక జాబితా పంపించినట్లు సమాచారం. ఇదే విధానంలో మరో విదేశీ బ్యాంకు హెచ్‌ఎస్‌బిసికి అందిస్తే వెనువెంటనే వివరాలు అందచేసింది. ఎక్కువ మంది పేర్లున్నట్లు దాదాపు ఏడువందల మందికిపైగా భారతీయ ప్రముఖులు ఆ బ్యాంకులో డబ్బు దాచుకున్నట్లు వెలుగుచూసింది. భారత ప్రభుత్వం అభ్యర్థన మేరకు ఖాతాల వివరాలు అందచేయాల్సిన పరిస్థితి రావడంతో స్విస్‌ బ్యాంకు నుంచి పెద్దఎత్తున నగదు, బంగారం విత్‌డ్రా చేసుకున్న ట్లు తెలుస్తున్నది.

అయినా ఎంత డబ్బు ఎవరు డిపాజిట్‌ చేశారో? ఎప్పుడు డ్రా చేశారు? తదితర వివరాలు వస్తే దానిపై విచారణ జరిగితే ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తాయని ఆశిస్తున్నారు. పన్నుచెల్లింపుదారుల్లో కొందరు భారతీయులు లెక్కకురాని భారీ మొత్తాలను హద్దులు దాటించి నిక్షిప్తం చేసుకుంటున్నారని, దీనివల్ల పన్నుల రాబడి గణనీయంగా తగ్గిపోతున్నదని ఏనాటి నుంచో భారత్‌ వాదిస్తున్నది. ఈ నల్లధనాన్ని వెలికితీసే ఉద్దేశ్యంతోటే పెద్దనోట్ల రద్దు, జిఎస్టీ లాంటి చర్యలను కేంద్రప్రభుత్వం చేపట్టింది. ముఖ్యంగా పెద్దనోట్ల రద్దు విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఏమాత్రం సమాచారం బయటకు పొక్కకుండా పటిష్టమైన వ్యూహంతో అడుగులు వేసినా ఆశించిన ఫలితాలు రాలేదు.
అనుకున్న మేరకు నల్లడబ్బు వెలుగుచూడలేదు. ఆకస్మికంగా పెద్ద నోట్ల రద్దువల్ల సామాన్యులే ఇబ్బందులు పడ్డారు తప్ప ఈ నల్లధనస్వాములకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్లు ఏదో ఒక మార్గంలో తమ నల్లడబ్బును కాపాడుకోగలిగారు.పాలకులు తీసుకుంటున్న ఈ చర్యలు ఈ నల్లడబ్బును పూర్తిగా వెలుగులోకి తీసుకురాలేకపోతాయేమోననిపిస్తున్నది. నల్లధనస్వాము లకు కొందరు అధికారులు,మరికొందరు రాజకీయ నాయ కుల అండదండలు ఉండటం వల్ల కూడా ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయనే ఆరోపణలను కొట్టివేయలేం. విదేశాల్లో ఉన్న నల్లధనస్వాములే కాదు స్వదేశంలో కూడా వీరి సంఖ్య పెరిగిపోతుండటం ఆందోళనకలిగించే అంశం. మొత్తం మీద విదేశాల్లో నిక్షిప్తం చేసుకున్న వేలకోట్ల నల్లధనాన్ని కొంతవరకు అయినా లెక్కలు తేలిస్తే పన్నుల రాబడి పెరిగి ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తుంది.

తాజా చెలి వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/women/