‘కేఫ్ కాఫీ డే’ వ్యవస్థాపకుడు వి.జి సిద్ధార్థ అదృశ్యం

కర్ణాటక మాజీ సీఎం అల్లుడు

VG Siddhartha
VG Siddhartha

బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణ అల్లుడు వీజీ సిద్ధార్థ అదృశ్యమయ్యారు. సోమవారం రాత్రి నుంచి ఆయన కనిపించడం లేదు. రాత్రి 8 గంటల సమయంలో బెంగళూరు నుంచి ఉల్లాల్‌కు చేరుకున్న సిద్ధార్థ్ బ్రిడ్జి వద్దకు వెళ్లాల్సిందిగా డ్రైవర్‌ను కోరారు. కారు బ్రిడ్జి చివరికి చేరుకున్నాక కారును ఆపమని చెప్పి దిగారు. బ్రిడ్జిపై కొంతదూరం నడిచి ఆ తర్వాత అదృశ్యమయ్యారని డ్రైవర్ పోలీసులకు తెలిపాడు.

90 నిమిషాలు వేచి చూసినా అతను తిరిగి రాకపోవడంతో డ్రైవర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ ఇచ్చిన సమాచారంతో వెంటనే బ్రిడ్జి వద్దకు చేరుకున్న మంగళూరు పోలీసులు సిద్ధార్థ కోసం గాలింపు మొదలుపెట్టారు. జిల్లా యంత్రాంగానికి చెందిన సీనియర్ అధికారులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని గాలింపును పర్యవేక్షించారు. వరద కారణంగా నేత్రావతి నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో గాలింపు చర్యలకు ఆటంకం కలుగుతోందని పోలీసులు తెలిపారు. కాగా ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప ఈరోజు ఉదయం ఎస్‌.ఎం.కృష్ణ నివాసానికి చేరుకున్నారు. అక్కడి నుంచే గాలింపు చర్యల్ని సమీక్షిస్తున్నారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/