పెంచిన పింఛన్లు ఆమోదం..20న లబ్దిదారులకు

ts cm kcr
ts cm kcr

హైదరాబాద్ : నూతన మున్సిపల్ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. సుమారు ఐదు గంటలకుపైగా ఈ సమావేశం లో ఈ సారి మున్సిపల్ చట్టం బిల్లుపై సుధీర్ఘంగా చర్చించిన అనంతరం, ఆ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అలాగే మంత్రివర్గ సమావేశంలో పెన్షన్ల అంశంపై విస్తృతంగా చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.


పెంచిన పెన్షన్లకు ఆమోదం


రాష్ట్రంలో పెంచిన పెన్షన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను ఈ నెల 20న రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల వారీగా లబ్దిదారులకు అందించాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. వృద్ధులు, వితంతువులు, బిడి కార్మికులు, గీత కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు, బోదకాలు వ్యాధి గ్రస్తులు, ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులకు ఇస్తున్న పెన్షన్లను రూ.1,000 నుంచి రూ.2,016కు పెంచాలని నిర్ణయించారు. వికలాంగులు, వృద్ధ కళాకారుల పెన్షన్‌ను రూ.1500 నుంచి రూ.3,016కు పెంచాలని నిర్ణయించారు. పెంచిన పెన్షన్‌ను 2019 జూన్ మాసం నుంచి అమలు చేస్తారు. జూన్ మాసానికి సంబంధించిన పెన్షన్‌ను జూలై నెలలో లబ్దిదారులకు అందిస్తారు. జూలై 20న అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా లబ్దిదారులకు పెంచిన పెన్షన్లకు సంబంధించిన ప్రొసీడింగ్స్ అందిస్తారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపిలు, ఎంఎల్‌సిలు, జెడ్‌పి చైర్మన్లు పాల్గొంటారు. నియోజకవర్గాల వారీగా ప్రొసీడింగ్స్ అందచేయడం కోసం సమావేశాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం కోరింది. ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ముగిసిన వెంటనే లబ్దిదారులకు పెన్షన్ సొమ్మును వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారు. పెంచిన పెన్షన్లు అందించడానికి సంవత్సరానికి రూ.12వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఇందులో రూ.11,800 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా, రూ.200 కోట్లు కేంద్ర ప్రభుత్వం భరిస్తున్నది.

వృద్దాప్య పెన్షన్ వయోపరిమితి తగ్గింపు


వృద్దాప్య పెన్షన్ల అర్హత వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గిస్తామనే టిఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల హామీని అమలు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. 57 సంవత్సరాలు నిండిన పేద వృద్ధుల జాబితాను వెంటనే రూపొందించాలని అధికారులను మంత్రివర్గం కోరింది. వీలైనంత త్వరలో లబ్దిదారుల జాబితా రూపొందించి, దాని ప్రకారం పెంచిన పెన్షన్ అందించాలని మంత్రివర్గం నిర్ణయించింది. బిడి కార్మికుల పిఎఫ్ కటాఫ్ డేట్‌ను తొలగించాలని నిర్ణయించింది. బుధవారం నాటి వరకు కూడా పి.ఎఫ్ ఖాతా ఉన్న కార్మికులకు పెన్షన్ అందించాలని అధికారులను ఆదేశించింది.


తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/