సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం

పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సభ ముందుకు

న్యూఢిల్లీ : మూడు సాగు చట్టాల రద్దుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఆ మూడు చట్టాలను ఉపసంహరించుకునేందుకు వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు 2021’ను పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఆ బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రధాని కార్యాలయంతో చర్చించాక ఈ బిల్లును ఫైనలైజ్ చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు కొన్ని రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినా కూడా పార్లమెంట్ లో చట్టాలను రద్దు చేసే వరకు ఢిల్లీ సరిహద్దుల నుంచి కదలబోమని రైతులు తేల్చి చెప్పారు. మరికొన్ని డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టారు. కనీస మద్దతు ధరపై చట్టం, విద్యుత్ బిల్లుల ఉపసంహరణ, రైతులపై పెట్టిన కేసుల ఎత్తివేత వంటి డిమాండ్లను అమలు చేస్తేనే అక్కడి నుంచి కదులుతామని హెచ్చరించారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/