ప్రారంభమైన దుబ్బాక ఉప ఎన్నికల పోలింగ్
బరిలో 23 మంది అభ్యర్థులు

దుబ్బాక: సిద్దిపేట జిల్లా దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మంగళవారం ఉదయం ఏడు గంటల ప్రారంభమైన ఓటింగ్.. సాయంత్రం వరకు కొనసాగనుంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి మృతితో ఖాళీ అయిన ఈ స్థానంలో మొత్తం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. టిఆర్ఎస్ నుంచి రామలింగారెడ్డి భార్య సుజాత, బిజెపి నుంచి మాధవనేని రఘునందన్‌రావు, కాంగ్రెస్ నుంచి చెరుకు శ్రీనివాసరెడ్డి పోటీలో ఉన్నారు. అయితే, ప్రధాన పోటీ మాత్రం టిఆర్ఎస్, బిజెపి మధ్య ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.
పోలింగ్ కేంద్రాల్లో అధికారులు రెండు ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. కరోనా కారణంగా హోంక్వారంటైన్లో ఉన్న 130 మందిలో 93 మంది ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. పోలింగ్ సమయం ముగియడానికి గంట ముందు కరోనా రోగులను ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. వీరికి ప్రత్యేక పీపీఈ కిట్లు అందించనున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు భౌతికదూరం పాటించేలా ప్రత్యేకంగా గుర్తులను ఏర్పాటు చేశారు. అలాగే పోలింగ్ కేంద్రాల్లోకి వచ్చే ప్రతి ఓటర్ను స్క్రీనింగ్ చేసి లోపలికి అనుమతిస్తున్నారు.
సవాళ్లు, ప్రతిసవాళ్లతో దుబ్బాక వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. కాగా, ఉదయాన్నే పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకున్న ఓటర్లు బారులుతీరారు. సాయంత్రం ఆరు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 315 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన ఎన్నికల అధికారులు వాటిని 32 సెక్టార్లుగా విభజించారు. ఈ నెల 10న ఓట్లను లెక్కించనున్నారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/