వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

దేశ వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఎంతో సేవ చేశారన్నమోడీ

Business Tycoon Pallonji Mistry Dies At 93; PM Pays Tribute

న్యూఢిల్లీ: భారత వ్యాపార దిగ్గజం, షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ ఛైర్మన్ పల్లోంజీ మిస్త్రీ కన్నుమూశారు. 93 ఏళ్ల మిస్త్రీ నిన్న రాత్రి ముంబైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్తతో భారత వాణిజ్య, పారిశ్రామిక రంగం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. పల్లోంజీ మరణం పట్ల ప్రధాని మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఆయన మరణ వార్తను విన్న తర్వాత ఎంతో బాధకు గురయ్యానని చెప్పారు. భారత వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు ఆయన ఎంతో చేశారని కొనియాడారు. పల్లోంజీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అసంఖ్యాకమైన ఆయన సన్నిహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

పల్లోంజీ మిస్త్రీ 1929లో గుజరాత్ లోని పార్శీ కుటుంబంలో జన్మించారు. మన దేశ వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఎంతో సేవ చేసిన ఆయనను భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో గౌరవించింది. షాపూర్జీ పల్లోంజీ గ్రూపును 1865లో స్థాపించారు. మన దేశంలో ఉన్న అతి పెద్ద వ్యాపార దిగ్గజాలలో ఈ గ్రూపు కూడా ఒకటి. నిర్మాణం, రియలెస్టేట్, టెక్స్ టైల్స్, ఇంజినీరింగ్ గూడ్స్, గృహోపకరణాలు, షిప్పింగ్, పబ్లికేషన్స్, పవర్, బయోటెక్నాలజీ తదితర రంగాల్లో ఈ గ్రూపు కార్యకలాపాలు ఉన్నాయి.

టాటా గ్రూపులో అత్యధిక వ్యక్తిగత షేర్ కలిగిన వ్యక్తి పల్లోంజీ మిస్త్రీ కావడం గమనార్హం. టాటా గ్రూపులో 18 శాతానికి పైగా వాటాను ఆయన కలిగి ఉన్నారు. మిస్త్రీ తండ్రి షాపూర్జీ పల్లోంజీ 1930లో టాటా సన్స్ షేర్స్ ను కొనుగోలు చేశారు. మిస్త్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపాన్ని తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/telangana/