వైరామవరంలో ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం

రన్నింగ్ లో ఉండగా ఊడిన ఆర్టీసీ బస్సు చక్రాలు

ఏపీలో వరుసగా ఆర్టీసీ బస్సు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళకు గురి చేస్తున్నాయి. నిన్నటికి నిన్న కర్నూల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. అనంతపురం నుంచి కర్నూల్ వెళ్తున్న బస్సు డోన్ పట్టణంలోని ఫ్లైఓవర్‌పై అదుపుతప్పింది. ఫ్లైఓవర్​పై కారును తప్పించబోయి ఆర్టీసీ బస్సు రక్షణ గోడను ఢీకొట్టింది. ముందు టైర్ గాల్లో వేలాడుతూ అక్కడే ఆగిపోయింది. కొద్దిగా ముందుకు దూసుకెళ్లి ఉంటే పెనుప్రమాదం జరిగేది. ఈ ఘటన ఇంకా మరిచిపోక ముందే తూర్పుగోదావరి జిల్లా, వైరామవరంలో మరో బస్ ప్రమాదం జరిగింది. రన్నింగ్ లో ఉండగా ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోయాయి.

గోకవరం నుంచి పాతకోట వెళ్తున్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు చక్రాలు రన్నింగ్ లో ఉండగానే ఒక్కసారిగా ఊడిపోయాయి. చాసిస్ తో సహా చక్రాలు ఉడిపోవడంతో బస్సు ఒక్కసారిగా కుంగింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి ఇంజన్ ఆఫ్ చేయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్పల్పగాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో ఆర్టీసీ బస్సుల ఫిట్ నెస్ పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.