తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం : ఆ నలుగురి ఎమ్మెల్యేల కు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు

టిఆర్ఎస్ కొనుగోలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశ వ్యాప్తంగా కూడా కాకా రేపుతోంది. గురువారం సాయంత్రం ఈ కొనుగోలు వ్యవహారానికి సంబదించిన మూడు గంటల నిడివి వీడియో బయటపెట్టారు కేసీఆర్. ఈ వీడియో ఫై బిజెపి నేతలు స్పందిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారం లో ఉన్న కీలక ఆ నలుగురు ఎమ్మెల్యేలకు భద్రతా పెంచింది తెలంగాణ ప్రభుత్వం.

ఈ వ్యవహారంలో ఉన్న తాండూర్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులకు బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలు కేటాయించింది సర్కార్. అలాగే ఈ ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద కూడా భద్రత పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఇక టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై సీఎం కేసీఆర్ నిర్వహించిన మీడియా సమావేశం మీద బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్‌ చుగ్ ఘాటుగా స్పందించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారన్న తరుణ్ చుగ్.. పార్టీ గురించి కలలో కూడా కంగారు పడుతున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించారు. కేసీఆర్‌‌కు ప్రధానమంత్రి కావాలనే మోజు పెరిగిందని.. అందుకు ఇలాంటి సినిమా స్టోరీలు అల్లుతూ బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.