రాజధాని తరలింపుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ఏపీలో మరోసారి రాజధాని రగడ మొదలైంది. గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న ఈ వ్యవహారం ..రీసెంట్ గా సీఎం జగన్ ఢిల్లీ లో రాజధాని ని వైజాగ్ కు తరలిస్తున్నట్లు తెలుపడం తో మరోసారి ఈ అంశం వార్తల్లో హైలైట్ అవుతుంది. ఇప్పటీకే పలువురు వైస్సార్సీపీ నేతలు రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలింపుపై స్పందించగా..తాజాగా ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్ చెప్పినట్టుగానే త్వరలోనే రాష్ట్ర పరిపాలన వైజాగ్ నుంచి జరుగుతుంది అని మరోమారు స్పష్టంచేశారు. రాష్ట్ర విభజన సమయంలో రెవిన్యూ నెగిటివ్ స్టేట్, ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని.. అలా ఉద్యోగుల జీతాలు ఒకటి, రెండు రోజులు ఆలస్యం అవుతుండటం ఈరోజు కొత్తేమీ కాదని అన్నారు. సిబ్బందికి జీతాలు ఆలస్యం అవుతున్నాయని టీడీపీ వివాదం చేస్తున్న విమర్శలను తిప్పికొడుతూ.. గతంలోనూ జీతాలు ఆలస్యంగా చెల్లించిన సందర్భాలు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు.

రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందడం కోసమే రాజధాని విషయంలో కూడా వికేంద్రీకరణ మంచిదనే ఉద్దేశంతోనే వైజాగ్‌ని రాజధానిగా నిర్ణయించడం జరిగింది అని ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. చంద్రబాబు మీటింగ్‌లో 12 మంది చనిపోయారు కాబట్టే ప్రజల వైపు నుంచి ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు నియమ నిబంధనలు పాటించమని సూచించాం అని మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. అంతకుమించి కొత్తగా ఎలాంటి ఆంక్షలు పెట్టలేదు అని స్పష్టంచేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజధాని అభివృద్ధి చెందడం కోసం వైజాగ్ నగరం అయితే సరిగ్గా సూట్ అవుతుంది అని అభిప్రాయపడ్డారు.