ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Budget meetings of Telangana Assembly from 24th of this month

హైదరాబాద్‌ః ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తోంది. వారం రోజుల పాటు జరిగే శాసన సభ సమావేశాల్లో 25 లేదా 26న వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఇదే నెలలో 23న కేంద్రప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అందులో రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే నిధులు, కేటాయింపుల ఆధారంగా అసెంబ్లీ సమావేశాల్లో చర్చించే అవకాశం కనిపిస్తోంది.అలాగే రైతుభరోసా, రైతు రుణమాఫీతో పాటు మరికొన్ని అంశాలపై కూడా వాడి వేడి చర్చ జరిగే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. గురువారం అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలపై రాష్ట్ర సిఎస్, డిజిపి పలువురు అధికారులతో అసెంబ్లీ స్పీకర్ , శాసన మండలి చైర్మన్ భేటీ అయ్యారు.సమావేశాల తీరు, ఏర్పాట్లపై చర్చించారు.

రాష్ట్ర వార్షిక బడ్జెట్ తో పాటు రైతు భరోసా,రైతు రుణమాఫీ అంశాలపై సమావేశాల్లో వాడి వేడి చర్చ జరిగే ఛాన్సుంది. కొత్త ఆర్వోఆర్ చట్టం, తెలంగాణ చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహం మార్పులపై కూడా చర్చించనున్నారు.అలాగే ఈసమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశ పెట్టనుంది రేవంత్ సర్కార్.

కాంగ్రెస్ ప్రభుత్వం పాలన పగ్గాలు చేపట్టిన తర్వాత రెండో సారి జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీలు బీజేపీ, బీఆర్ఎస్ కూడా అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకుంటున్నాయి. ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలు..6 గ్యారెంటీల అమలు,నిరుద్యోగుల ఆందోళన, లా అండ్ ఆర్డర్ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు ఈ అసెంబ్లీ సమావేశాలను వేదికగా మార్చుకునే అవకాశం కనిపిస్తోంది.

ప్రజాసమస్యలు, పాలనపరమైన నిర్ణయాలతో పాటు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, కాంగ్రెస్ పార్టీ చేరికలను ప్రోత్సహించడం వంటి అంశాలపై కూడా కాంగ్రెస్ ను కడిగిపారేసేందుకు బీజేపీ, బీఆర్ఎస్ వ్యూహాలకు పదునుపెడుతున్నాయి.