బుద్ధా వెంకన్న దీక్ష భగ్నం చేసిన పోలీసులు

టీడీపీ నేత బుద్దా వెంకన్న చేపట్టిన నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పెద్ద ఎత్తున దీక్ష శిబిరానికి చేరుకున్న పోలీసులు బుద్ధ వెంకన్న దీక్షను భగ్నం చేసి.. అక్కడ నుంచి వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విశాఖలో టీడీపీ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలు దేరిన బుద్ధా వెంకన్నను పోలీసులు అడ్డుకోవడంతో గురువారం(అక్టోబర్ 27) మధ్యాహ్నం నుంచి తన ఇంటి వద్దే బుద్దా వెంకన్న నిరవధిక దీక్షకు దిగిన సంగతి తెలిసిందే. వెంకన్న దీక్షకు పలువురు మద్దతు తెలిపారు.

కాగా శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు బుద్ధా దీక్షను భగ్నం చేసి బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. దీక్ష కారణంగా బుద్ధా వెంకన్న సుగర్ లెవెల్స్ పడిపోయాయని వైద్యులు సూచించడంతో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేసి ఆసుపత్రికి తరలించారు. అంతకు ముందు అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులతో బుద్ధా వెంకన్నకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారు బుద్ధా సుగర్ లెవల్స్ పడిపోయాననీ, వెంటనే ఆసుపత్రికి తరలించాలని సూచించారు. దీంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోనికి దింపి బలవంతంగా ఆయనను ఆసుపత్రికి తరలించారు.