మరోసారి తీవ్రంగా స్పందించిన బుద్ధా

టీడీపీ అధినేత నివాసం వద్ద ఉద్రిక్తత

అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నివాసాన్ని వైస్సార్సీపీ శ్రేణులు ముట్టడించిన నేపథ్యంలో, ఇరుపక్షాల మధ్య ఆగ్రహావేశాలు ఇంకా చల్లారలేదు. టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మరోసారి ఘాటుగా స్పందించారు. విపక్షనేత ఇంటిపై దాడికి అల్లరిమూకను పంపిన సీఎం జగన్ తప్పుడు కేసులతో టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలని కుట్ర పన్నుతున్నాడని, అది ఆయనలోని భయానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు తమ దేవుడు అని, ఆయన జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో ఎన్ని కేసులు పెట్టినా తగ్గేదే లే అంటూ స్పష్టం చేశారు.

“మాపై దాడి చేసి రివర్స్ లో తప్పుడు కేసులు పెట్టే దుస్థితికి దిగజారిపోయారు. దీన్నిబట్టే మీ పరిస్థితి ఏంటో అర్థమవుతోంది. చంద్రబాబు కోసం ప్రాణాలు ఇవ్వడానికి కార్యకర్తలు, నాయకులం సిద్ధంగా ఉన్నాం” అని బుద్ధా ఉద్ఘాటించారు. అటు, టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం వద్ద జరిగిన ఘటనల నేపథ్యంలో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. టీడీపీ నేత జంగాల సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదుతో ఒక కేసు నమోదు చేయగా, వైస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ కారు డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరో కేసు నమోదు చేశారు. ఈ మేరకు తాడేపల్లి పోలీసులు వెల్లడించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/