పిల్లికి బిచ్చం పెట్టని ప్రభుత్వం..పేదలకు పరమాన్నం పెడుతుందా!

buddha venkanna
buddha venkanna

అమరావతి: టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఏపి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వైఎస్‌ఆర్‌సిపి ఎంపి విజయసాయిరెడ్డిని ‘శకుని మామా’ అని పేర్కొంటూ తన ట్విట్టర్ ఖాతాలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘మీ తుగ్లక్ జగన్ ఇసుకని కూడా లేకుండా చేసి కార్మికుల్ని నడిరోడ్డుమీద పడేశాడు. పిల్లికి బిచ్చం పెట్టని మీరు పేదలకు పరమాన్నం పెడతారనుకోవడం భ్రమ శకుని మామా!… దాదాపు 70 లక్షల మంది ఉపాధి కోల్పోయేలా చేసిన మీరు కూడా ఇసుక గురించి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది శకుని మామా! టిడిపి హయాంలో చంద్రబాబు ప్రజలకు ఉచితంగా ఇసుకని ఇచ్చారు. కార్మికుల కడుపు నింపారు’ అని ఆయన పేర్కొన్నారు.

‘ఢిల్లీలో కూర్చొని కాళ్లు పట్టుకునే నీకు, అపాయింట్ మెంట్ దొరక్క కాలుగాలిన పిల్లిలా పచార్లు చేస్తున్న మీ తుగ్లక్ జగన్ కి విశ్వసనీయత అంటే అర్థం తెలియదు శకుని మామా. మీ తప్పుల్ని చంద్రబాబు ఎండగడుతుంటే అంత ఉలిక్కిపడుతున్నావ్, త్వరలో తీహార్ వెళ్లాల్సి వస్తుందనా?’ అని ఎద్దేవా చేశారు. కాగా, ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌.. ఈ రోజు కేంద్ర మంత్రి అమిత్ షాతో సమావేశమైన విషయం తెలిసిందే. సోమవారం ఢిల్లీ వెళ్లిన జగన్ కి సాయంత్రం వరకు అమిత్ షా అపాయింట్ మెంట్ ఇవ్వలేదని వార్తలు వచ్చాయి.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/