బ్లూచిప్‌ కంపెనీల జోరు

BSE
BSE

బ్లూచిప్‌ కంపెనీల జోరు

ముంబై: గడచిన వారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుల్‌ ర్యాలీ తీశాయి. మార్కెట్లను ప్రభావితం చేయగల హెవీవెయిట్స్‌ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌డి ఎఫ్‌సి, హెచ్‌యుఎల్‌ తదితరాలు పెరగడంతో ప్రామాణిక సూచి సెన్సెక్స్‌ సరికొత్త రికార్డు లు అందుకుంది. గతంలో నమోదైన 36,444 పాయింట్లను ఇంట్రాడేలో అధిగమించింది.

అంతేకాకుండా గురువారు 36,548 వద్ద నిలిచి సరికొత్త ముగింపు రికార్డును సైతం సాధించింది. ఇక వారాంతాన ఇంట్రాడేలో 36,740 వద్ద చరిత్రాత్మక గరిష్టాన్ని తాకింది. ఇక నిఫ్టీ గరిష్ట రికార్డుకు 100 పాయింట్ల చేరువగా 11,071కు వచ్చి వెనకడుగు వేసింది. శుక్రవారంతో ముగిసిన గత వారం సెన్సెక్స్‌ నికరంగా 884 పాయింట్లు పెరిగి 36,542 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 246 పాయింట్లు పెరిగి 11,019 వద్ద ముగిసింది. అయితే అదే విధంగా వారం మొదట్లో జోరందుకున్న చిన్న షేర్లు తదిపరి అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నా యి. చివరికి బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌ సూచి 0.26 శాతం పెరిగింది. స్మాల్‌క్యాప్‌ 0.85 శాతం పుంజుకుంది.

సెన్సెక్స్‌ దిగ్గజాలలో ఆర్‌ఐఎల్‌ 12శాతంపైగా పెరిగింది. ఎస్‌బ్యాంకు, విప్రో 7శాతం చొప్పున ఎగశాయి. ఈ బాటలో హెచ్‌యూఎల్‌, బజాజ్‌ఆటో, హెచ్‌డిఎఫ్‌సి, టిసిఎస్‌, కోటక్‌ బ్యాంకు, ఇన్ఫోసిస్‌ 4నుంచి రెండు శాతం మధ్య లాభపడ్డాయి. అయితే హీరోమోటోకార్ప్‌ 5 శాతం పతనంకాగా, వేదాంతా 4శాతం, టాటామోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు 2 శాతం చొప్పున పతనమయ్యాయి. వచ్చేవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా కార్పొరేట్‌ ఫలితాలు నిర్దేశించనున్నాయి. వీటికితోడు విదేశీ అంశాలకూ ప్రాధాన్యత ఉంది. ఇప్పటికే ఐటి దిగ్గజాలు టిసిఎస్‌, ఇన్ఫోసిస్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక ఫలితాలు విడుదల చేయగా, ప్రైవేట్‌ రంగ బ్యాంకు ఇండస్‌ఇంగ్‌ సైతం పనితీరు వెల్లడించింది. ఈ బాటలో వచ్చేవారం మరికొన్ని బ్లూచిప్స్‌ మొదటి త్రైమాసికం ఫలితాలు ప్రకటించనున్నాయి.

సోమవారం 16న ఎఫ్‌ఎంసిజి కంపెనీ హెచ్‌యూఎల్‌, 17న జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, అశోక్‌లేలాండ్‌, 18న అల్ట్రాటెక్‌ సిమెంట్‌, 19న కోటక్‌ మహీంద్రా బ్యాంకు, బజాజ్‌ ఫైనాన్స్‌, 20న విప్రో, బజాజ్‌ఆటో, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్‌ తదితరాలు మొదటి త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనున్నాయి. వీటితోపాటు 16న ప్రభుత్వం జూన్‌ నెలకు టోకు ధరల ద్రవ్యోల్బణ (డబ్ల్యూపిఐ) గణాంకాలు వెల్లడించనుంది. మేలో డబ్ల్యూపిఐ 4.43 శాతం పెరిగింది. ఇప్పటికే జూన్‌ రిటైల్‌ ధరల ద్రవ్యోల్బణం పెరగ్గా, మే నెలలో పారిశ్రామికోత్పత్తి మందగించిన విషయం తెలిసిందే. 16న యూఎస్‌-రష్యా సదస్సు జరగనుంది. అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌తో సమావేశం కానున్నారు.

దీనిలో భాగంగా సిరియా, ఉక్రెయిన్‌ వివాదాలు, ఆంక్షల విధింపు తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాగా, యూఎస్‌ రిటైల్‌ సేల్స్‌, చైనా రెండవ త్రైమాసికం జిడిపి గణాంకాలు 16న విడుదల కానున్నాయి. విదేశీ స్టాక్‌మార్కెట్లలో నెలకొనే పరిస్థితులతోపాటు ముడి చమురు ధరలు, డాలరుతో మారకంలో రూపాయి కదలికలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడుల తీరు వంటి అంశాలు సైతం సెంటిమెంటును ప్రభావితం చేయగలవని విశ్లేషకులు పేర్కొంటున్నారు.