మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS పోటీ – కేసీఆర్ కీలక ప్రకటన

మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో BRS పోటీ చేస్తుందని కేసీఆర్ కీలక ప్రకటన చేసారు. శనివారం కేసీఆర్ సమక్షంలో మ‌హారాష్ట్ర షెట్కారీ సంఘ‌ట‌న్ రైతు నేత శ‌ర‌ద్ జోషి ప్ర‌ణీత్ తో పాటు పలువురు రైతు నేత‌లు బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఈ సందర్భాంగా వారంద‌రికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలిపారు. మెజారిటీ స్థానాలు దక్కేలా ప్రయత్నించాలని పార్టీ శ్రేణులకు నిర్దేశించారు. రైతుల నాయకత్వంలో ముందుకు పోదామని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ గెలుపుకోసం కమీటీలు వేస్తామన్న కేసీఆర్.. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. త్వరలోనే విదర్భలో భారీ బహిరంగ సభ కూడా పెడదామని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్ఎస్ కిసాన్ స‌మితి జాతీయ అధ్య‌క్షుడు గుర్నామ్ సింగ్ చ‌డునీ, మ‌హారాష్ట్ర కిసాన్ స‌మితి అధ్య‌క్షుడు మాణిక్ క‌దం, మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, హ‌రీశ్‌రావు, ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు ప‌ల‌వురు నేత‌లు పాల్గొన్నారు.