నేడే ఖమ్మంలో బిఆర్ఎస్ తొలి బహిరంగ సభ..

నేడు ఖమ్మంలో బిఆర్ఎస్ పార్టీ తొలి బహిరంగ సభ జరగబోతుంది. ఈ సభకు సంబదించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసారు అధికారులు. రాష్ట్రంలోని 31 జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, కర్నాటక, ఢిల్లీ, పంజాబ్‌, యూపీ రాష్ర్టాల నుంచి ప్రజలు, ప్రతినిధులు హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు ఆ మేరకు భద్రతా ఏర్పాట్లు చేశారు. బుధవారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఖమ్మంలో నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించిన అనంతరం బీఆర్‌ఎస్‌ భారీ బహిరంగ సభలో దేశ ప్రజలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే ఈ సభ కు కేరళ సీఎం పినరాయి విజయన్‌, ఢిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ లుహాజరు కాబోతున్నారు. ఇప్పటికే వీరంతా హైదరాబాద్ కు చేరుకున్నారు. సీఎం కేసీఆర్ తో కలిసి వీరంతా ఈరోజు ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌ నుంచి యాదగిరిగుట్టకు రెండు హెలికాప్టర్లలో బయల్దేరి 11:30 గంటలకు గుట్టకు చేరుకుంటారు. సీఎంలకు స్వాగతం పలికేందుకు ఆలయ అధికారులు, అర్చకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. హెలిప్యాడ్‌ వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుట్టపైకి వెళ్తారు.

గుట్టపై అర్చకులు పూర్ణకుంభం అందించి స్వాగతం పలుకుతారు. నలుగురు సీఎంలు స్వయంభూ లక్ష్మీ నారసింహుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ముఖ్యమంత్రులకు అర్చకులు వేదమంత్రోచ్చారణలతో ఆశీర్వచనం చేస్తారు. అనంతరం 12:30 గంటలకు గుట్ట నుంచి హెలికాప్టర్‌లో ఖమ్మం బహిరంగ సభకు రానున్నారు. ఇక ఖమ్మం సభ ద్వారా సత్తా చాటాలని చూస్తోంది బీఆర్ఎస్. సభకు ముగ్గురు సీఎంలు, నేషనల్ పార్టీ లీడర్లను ఆహ్వానించడం ద్వారా జాతీయ స్థాయిలోనూ చర్చ జరిగేలా ప్లానేసింది. ఖమ్మం సభ ద్వారా.. బీఆర్ఎస్ ఎజెండా, విధివిధానాలపై కేసీఆర్ కీలక ప్రకటన చేసేలా తెలుస్తోంది. ఎనిమిదేళ్ల పాలనలో తెలంగాణలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, జరిగిన అభివృద్ధి గురించి వివరించనున్నారు. అదే సమయంలో.. ప్రస్తుతం దేశ ప్రజలకు ఎలాంటి అవసరాలున్నాయి? వారికోసమంటూ తీసుకురావల్సిన పథకాలేంటన్నది ప్రకటించనున్నారు బీఆర్ఎస్ అధినేత. ఆప్, సీపీఎం, సీపీఐ, ఎస్పీ పార్టీల అధినేతలను ఆహ్వానించడం ద్వారా.. భవిష్యత్ లో వీరి తోనే తమ దోస్తీ ఉండబోతున్నట్టు సంకేతాలనిస్తున్నారు సీఎం కేసీఆర్.

ఇక సభ ఏర్పాట్ల విషయానికి వస్తే..ఐదు లక్షల మంది జనసమీకరణతో వంద ఎకరాల్లో ఈ సభ నిర్వహిస్తున్నారు. 448 ఎకరాల్లో పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేశారు. మొత్తం వెయ్యిమంది వాలంటీర్లను నిమించారు. సభా వేదికపై ముఖ్య అతిథులతో పాటు ఖమ్మం జిల్లా BRS ప్రజా ప్రతినిథులు, ముఖ్య నేతలు మాత్రమే ఉంటారు. మిగిలిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు వేదిక ముందు ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రాంగణంలో కూర్చోనున్నారు.