విజయవాడలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు

మరోసారి విజయవాడలో బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిసాయి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించగానే విజయవాడ లో బిఆర్ఎస్ ను స్వాగతిస్తూ ప్లెక్సీలు వెలువగా..తాజాగా మరోసారి బీఆర్ఎస్ ఫ్లెక్సీలు వెలిసాయి. బిఆర్ఎస్ కు ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో..తెలంగాణ భ‌వ‌న్‌లో భార‌త రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. భార‌త రాష్ట్ర స‌మితి జెండాను ఆ పార్టీ అధినేత‌,సిఎం కెసిఆర్ ఆవిష్క‌రించారు. జెండాను ఆవిష్క‌రించిన స‌మ‌యంలో తెలంగాణ భ‌వ‌న్ ప‌టాకులు, డ‌ప్పుల‌తో ద‌ద్ధ‌రిల్లిపోయింది. జై కెసిఆర్, జై భార‌త్ నినాదాలు మార్మోగాయి. జెండా ఆవిష్క‌రణ కంటే ముందు బిఆర్ఎస్ ప‌త్రాల‌పై కెసిఆర్ సంత‌కం చేశారు.

కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా.. బీజేపీకి ప్రత్యామ్నాయంగా తాను జాతీయ పార్టీ ప్రకటించినట్లు కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేసి ఒక సమర్థవంతమైన పాలన అందిచేందుకే జాతీయ పార్టీ ప్రకటించినట్లు తెలిపారు. కర్ణాటకలో జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోనున్నట్లు చెప్పారు. ఈ మేరకు వచ్చే జనరల్ ఎలక్షన్స్‌లో జేడీఎస్‌కు తమ మద్దతు ఉంటుందని ఇప్పటికే ఆయన ప్రకటించారు. పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులోనూ పార్టీ విస్తరణపై ప్రధానంగా ఆయన దృష్టి సారించినట్లు తెలుస్తోంది.

ఏపీలోను బిఆర్ఎస్ ను విస్తరింపచేయబోతున్నారు. విజయవాడ లో పార్టీ ఆఫీస్ ను ఏర్పటు చేయబోతున్నారు. దీనికి సంబదించిన పనులను మంత్రి తలసానికి అప్పగించారు. ఇదిలా ఉంటె విజయవాడలో కొందరు బీఆర్ఎస్ ఆవిర్భావాన్ని స్వాగతిస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఏపీలోనూ కేసీఆర్ మార్క్ పాలిటిక్స్ నడపనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. “జయహో కేసీఆర్.. దేశ రాజకీయాలలో నూతన శకం. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావం. కక్ష రాజకీయాలకు స్వస్తి. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయానికి కొత్త భరోసా.” అంటూ బండి రమేశ్, డి భవానీ కుమార్ పేరుతో ఎంజీ రోడ్డులో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.