ఎర్రకోటపై ఎగిరేది బీఆర్ఎస్ జెండానే – కేసీఆర్

ఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగిరేది గులాబీ జెండానే అని సీఎం కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. తెలంగాణ భ‌వ‌న్‌లో భార‌త రాష్ట్ర స‌మితి ఆవిర్భావ వేడుక‌లు అట్ట‌హాసంగా జ‌రిగాయి. భార‌త రాష్ట్ర స‌మితి జెండాను ఆ పార్టీ అధినేత‌,సిఎం కెసిఆర్ ఆవిష్క‌రించారు. జెండాను ఆవిష్క‌రించిన స‌మ‌యంలో తెలంగాణ భ‌వ‌న్ ప‌టాకులు, డ‌ప్పుల‌తో ద‌ద్ధ‌రిల్లిపోయింది. జై కెసిఆర్, జై భార‌త్ నినాదాలు మార్మోగాయి. జెండా ఆవిష్క‌రణ కంటే ముందు బిఆర్ఎస్ ప‌త్రాల‌పై కెసిఆర్ సంత‌కం చేశారు. అంత‌కు ముందు ముందు భ‌వ‌న్‌లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక పూజ‌ల్లో సిఎం కెసిఆర్ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఢిల్లీ ఎర్ర‌కోట‌పై ఎగిరేది గులాబీ జెండానే అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. అబ్ కీ బార్ కిసాన్ స‌ర్కార్ భార‌త రాష్ట్ర స‌మితి నినాదం అని పేర్కొన్నారు. ఈ నెల 14వ తేదీన ఢిల్లీలో బీఆర్ఎస్ కార్యాల‌యాన్ని ప్రారంభిస్తామ‌న్నారు. దేశ ప‌రివ‌ర్త‌న కోస‌మే భార‌త రాష్ట్ర స‌మితి ఏర్ప‌డింద‌న్నారు. ఎన్నిక‌ల్లో గెలవాల్సింది ప్ర‌జ‌లు.. రాజ‌కీయ పార్టీలు కాద‌న్నారు. దేశానికి ఇప్పుడు కొత్త ఆర్థిక విధానం అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. జాతీయ స్థాయిలో కొత్త ప‌ర్యావ‌ర‌ణ విధానం అమ‌లు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. మ‌హిళా సాధికారిక‌త కోసం కొత్త జాతీయ విధానం అమ‌లు చేయాల‌న్నారు. రాబోయేది రైతు ప్ర‌భుత్వ‌మే అని సీఎం స్ప‌ష్టం చేశారు.