ఉప్పల్ లో మేయర్ విజయలక్ష్మికి చేదు అనుభవం

మేయర్ విజయలక్ష్మికి ఉప్పల్ లో చేదు అనుభవం ఎదురైంది. చిలుకానగర్ డివిజన్ అభివృద్ధి పనుల శంకుస్థాపనను వెళ్లిన ఆమెను ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి అనుచరులు అడ్డుకున్నారు. సుభాష్ రెడ్డి లేకుండా శంకుస్థాపన ఎలా చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకోవడంతో విజయలక్ష్మి సైతం సీరియస్ అయ్యింది. ఎమ్మెల్యే తో నాకేంటి.. ఇది నా కార్యక్రమం అంటూ సమాధానం ఇచ్చింది.

ప్రొటోకాల్ వ్యవహారాలతో తనకు సంబంధం లేదని, అది అధికారుల పని అంటూ ఆమె చెప్పుకొచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నిధులతో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఎమ్మెల్యేను ఆహ్వానించాల్సిన అవసరం లేదంటూ ఎమ్మెల్యే అనుచరులతో వాదించారు. దీంతో మేయర్ ప్రొటోకాల్ పాటించడం లేదని ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో విజయలక్ష్మిశంకుస్థాపన చేయకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారు.