గుమ్మడికాయతో దిష్టితీసి కవితను ఇంట్లోకి ఆహ్వానించారు

ఈడీ విచారణ అనంతరం ఢిల్లీ లోని తన నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు మహిళా నేతలు గుమ్మడికాయతో దిష్టితీసి ఇంట్లోకి ఆహ్వానించారు. అలాగే కవితను ఆలింగనం చేసుకొని సంతోషం వ్యక్తం చేసారు. కవిత పక్కన ఆమె భర్త, ఇతర బంధువులు ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈరోజు ఈడీ ముందుకు బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత హాజరైన సంగతి తెలిసిందే. ఉదయం 11 గంటలకు ఈడీ అధికారులు కవితను విచారించడం మొదలుపెట్టారు. దాదాపు 09 గంటలపాటు కవిత ను విచారించిన అధికారులు తిరిగి 16 న మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేశారు. విచారణ మధ్యలో 10 నిమిషాల పాటు కవిత కు బ్రేక్ ఇచ్చారు. విచారణ పూర్తి కాగానే కవిత నేరుగా ఇంటికి వెళ్లిపోయారు.

రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బీఆర్‌ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. అయితే.. కవిత బయటికి రాగానే.. బీఆర్ఎస్ శ్రేణుల్లో సంతోషం తో ఓ వెలుగు వెలిగాయి. పెద్ద ఎత్తున నినాదాలు చేసారు. ప్రస్తుతం కవిత, హరీష్ రావు , కేటీఆర్ లతో పాటు మిగతా బిఆర్ఎస్ నేతలంతా హైదరాబాద్ కు పయనమయ్యారు.

ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద కవిత స్టేటమేంట్ రికార్డ్ చేశారు అధికారులు. విచారణ సందర్భంగా లిక్కర్ స్కాం గురించి నాకేం తెలియదని.. నేను కుట్రదారుని కాదు అని స్పష్టం చేశారామె. ఎలాంటి ఆధారాలు ధ్వంసం చేయలేదంటూ ఈడీ ప్రశ్నలకు సమాదానం ఇచ్చారు కవిత. ఆమెను ప్రశ్నించే సమయంలో.. అరుణ్ పిళ్లయ్ కూడా అక్కడే ఉన్నారు. గత విచారణలో కవిత బినామీ అంటూ ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా.. రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు అధికారులు.