అన్నదమ్ముల ఆదర్శజీవనం

ఆధ్యాత్మిక చింతన

Om
Om

సమాజంలో ధర్మబద్ధంగా జీవితాన్ని కొనసాగించుకోవాలనే వారు ఎన్నో సమస్యలనెదుర్కోవలసి వస్తుంది. మరెన్నో క్లిష్టపరిస్థితులను అధిగమించాల్సి వస్తుంది.

నీతినియమాలతో ఆధ్యాత్మిక మార్గంలో సాగడం సాహసంతో కూడిన పని. ఎవరితో ఎలా ప్రవర్తించాలో సత్యధర్మాలనాచరించే వారికి అగ్ని పరీక్ష కాగలదు.

ఒక వ్యాపారి నిజాయితీగా తన వృత్తిలో వ్యవహరిస్తే కష్టాలను ఎక్కువగా ఎదుర్కొనవలసి వస్తుంది.

సత్యధర్మాల ఆచరణలో ఎన్ని కష్టాలు ఎదురైనా వాటిని ఎదుర్కొని ముందుకు సాగడానికి ప్రయత్నించాలి.

మన కళ్లముందే ఎంతో మంది అవినీతికి, అన్యాయాలకు పాల్పతుడూ సుఖంగా జీవిస్తున్నారు.

కనుక మనం మాత్రం ఆ ధర్మాలు వల్లిస్తూ జీవితాన్ని కష్టాల పాలు చేసుకోవడం ఎందుకు అని భావించరాదు.

బాహ్య సంపదల వల్లే ప్రశాంతత పొందవచ్చుననుకుంటే ధృతరాష్ట్రుడికి సంపదలు అన్ని ఉన్నా అతడు అశాంతికి ఆహుతి అయ్యాడు.

అతని అధర్మ ప్రవర్తనయే దానికి కారణం. సత్ప్రవర్తన లేని వ్యక్తి మృతతుల్యుడు కాబట్టి సద్వర్వనతో జీవించాలి అని ధృతరాష్ట్రుడికి విదురుడు బోధించాడు.

ఎట్టి క్లిష్టపరిస్థితుల్లోనైనా ఆదర్శాలను వీడక హరిశ్చంద్రుడు, శిబిచక్రవర్తి, బలిచక్రవర్తి, దధీచి, కర్ణుడు మొదలైన వారు చిరస్మరణీయులైనారు.

కష్టాలకు, అవమానాలకు అధైర్యపడకుండా సత్యాన్నే పాటించుతూ జీవించాడు హరిశ్చంద్రుడు.

ఒక పావ్ఞరాన్ని కాపాడటానికి తన శరీరాన్నే శిబిచక్రవర్తి కోసి ఇచ్చాడు.

వామనుడికిచ్చిన మాట ప్రకారం తన ప్రాణమే ఇచ్చాడు బలిచక్రవర్తి. వెన్నెముకను ఇంద్రుడికి ఆయుధంగా ఇచ్చాడు దధీచి, సహజసిద్ధమైన కవచకుండలాలను కోసి ఇచ్చాడు కర్ణుడు.

వీరంతా ధర్మపరాయణులు. సత్యవ్రతనిష్టులు.

త్యాగధనులు. కాబట్టే వీరి కీర్తి చిరస్థాయిగా నిలిచిపోయింది. వీరీ జీవితాలు మనకు ఆదర్శనీయం. ఒక నదీ తీరంలో ఇద్దరన్నదమ్ములు రెండు కుటీరాలలో జపధ్యానాలు చేస్తుండేవారు.

ఒకరోజు ఉదయాన్నే అన్నగారి కుటీరానికి పక్కన ఉన్న మామిడి పళ్లను చూసి కోశాడు. యజమాని గమనించి అతని అన్నయ్యకు చెప్పాడు. అన్నయ్య విషయం అడిగి తెలుసుకున్నాడు.

తమ్ముణ్ణి అడిగి సమాధానం విని తమ్ముడూ! నాతో చెప్పకుండా కుటీరం వద్ద ఉన్న మామిడి పండ్లను కోశావు.

యజమాని అనుమతి లేకుండా వారి వస్తువ్ఞలను తీయడం దొంగతనంతో సమానం.

కాబట్టి నీవ్ఞ ఈ అధర్మకార్యానికి తగిన శిక్ష అనుభవించి తీరాలి అని అన్నాడు. ప్రజలు తప్పు చేస్తే దండించే అధికారం మహారాజుకే ఉంది.

కాబట్టి మహారాజు దగ్గరకు వెళ్లి శిక్షను పొంది రమ్మన్నాడు.

అన్నగారి మాట ప్రకారం తమ్ముడు మహారాజు దగ్గరకు వెళ్లి జరిగిన విషయాన్నంతా వివరించాడు.

దొంగతనం చేయడానికి ఉపయోగపడినవి చేతులు కాబట్టి రెండు చేతులను ఖండించాలి అని రాజు ఆజ్ఞాపించాడు.

రాజాజ్ఞ ప్రకారం అతని రెండు చేతులను ఖండించారు

. మొండి చేతులతో కుటీరానికి తిరిగి వచ్చిన తమ్ముణ్ణి అన్న కౌగించుకుని తమ్ముడూ!

నదిలో స్నానం చేసిరా అని చెప్పాడు. తమ్ముడు నదిలో మునిగి పైకి లేచేసరికి రెండు చేతులూ తిరిగి వచ్చాయి.

అప్పుడు తమ్ముణ్ణి చూసి అన్నయ్య ఆనందంతో ధర్మాన్ని ఆచరిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుంది అనే శాస్త్ర వచనాలు నిత్యసత్యాలని అన్నాడు.

ఆ అన్నదమ్ములే శంఖ ధర్మ శాస్త్రాన్ని రచించిన శంఖుడు, లిఖితుడు. ఎప్పటికైనా సత్యమే జయిస్తుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం:https://www.vaartha.com/andhra-pradesh/