మూడున్నరేళ్ల తర్వాత నెరవేరిన ప్రజల కోరిక

ఈ తెల్లవారుజామున 4:30 నుంచి అమల్లోకి బ్రెగ్జిట్

Britain
Britain

లండన్‌: యూరోపియన్ యూనియన్ (ఈయూ) నుంచి విడిపోవాలన్న బ్రిటన్ ప్రజల కోరిక ఎట్టకేలకు నెరవేరింది. భారత కాలమానం ప్రకారం ఈ తెల్లవారుజామున 4:30 నుంచి బ్రిటన్‌లో బ్రెగ్జిట్ అమల్లోకి వచ్చింది. ఫలితంగా యూరోపియన్ యూనియన్‌తో ఉన్న 47 ఏళ్ల బంధానికి ఫుల్‌స్టాప్ పడింది. ఈయూ నుంచి బయటకు వచ్చిన బ్రిటన్ ఇక నుంచి ప్రపంచ దేశాలతో సరికొత్త వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి స్వేచ్ఛ ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు లభిస్తుంది. ఈయూ నుంచి వేరుపడినంత మాత్రాన ఇది అంతం కాదని, ఇక నుంచి నూతన శకం ఆరంభమవుతుందని జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో జాన్సన్ పేర్కొన్నారు. ఈయూతో తెగదెంపులు చేసుకోవాలన్న బ్రిటన్ ప్రజల కోరిక మేరకు మూడున్నరేళ్ల క్రితం దేశంలో రెఫరెండం నిర్వహించారు. ఇందులో 52శాతం మంది ప్రజలు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేసి తమ మనోభీష్టాన్ని చాటారు. ఎన్నో అవాంతరాల మధ్య ఇన్నాళ్లకు అది చట్టంగా మారింది. నేటి నుంచి బ్రిటన్‌లో నూతన అధ్యాయం ప్రారంభం కావడంపై ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/