బ్రెగ్జిట్‌కు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం

నేటి రాత్రి 11 గంటల తర్వాత ఈయూతో తెగదెంపులు 

uk-prime-minister-boris-johnson-signs-brexit-trade-deal

లండన్‌: యూరోపియన్‌ యూనియన్‌తో బ్రిటన్ బంధానికి మరికొన్ని గంటల్లో తెరపడబోతోంది. నేటి రాత్రి 11 గంటల తర్వాత నుంచి బ్రెగ్జిట్ అమల్లోకి రాబోతోంది. ఈయూతో తెగదెంపులు చేసుకుంటూ తీసుకొచ్చిన బిల్లుకు బ్రిటన్ పార్లమెంట్ నిన్న ఆమోదం తెలిపింది. నేటి రాత్రితో ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమిస్తుండడంతో యూనియన్‌లోని ఇతర దేశాల్లా బ్రిటన్‌కు ఇకపై ఎటువంటి వెసులుబాట్లు ఉండవు.

నిజానికి ఈయూలో ఉండడం వల్ల తమకు ఎటువంటి లాభం లేకపోగా, ఆర్థిక భారం పెరుగుతోందని భావించిన బ్రిటన్ బ్రెగ్జిట్‌ను తెరపైకి తీసుకొచ్చింది. ఈయూ నుంచి వైదొలగాలా? వద్దా? అనే విషయంపై 2016లో అప్పటి ప్రధాని డేవిడ్ కామెరూన్ రెఫరెండం నిర్వహించారు. అందులో 52 శాతం మంది బ్రెగ్జిట్‌కు ఓటేశారు. ప్రజాతీర్పు తనకు వ్యతిరేకంగా రావడంతో కామెరూన్ తన పదవికి రాజీనామా చేశారు.

నిజానికి 29 మార్చి 2019 నాటికే బ్రెగ్జిట్ పూర్తికావాల్సి ఉండగా, బ్రిటన్ పార్లమెంటు ఆమోదం లభించకపోవడంతో కామెరూన్ తర్వాత పదవి చేపట్టిన థెరెసా మే కూడా రాజీనామా చేశారు. ఆ తర్వాత బోరిస్ జాన్సన్ రావడంతో బ్రెగ్జిట్‌పై అడుగుముందుకు పడింది. తాజాగా, బ్రెగ్జిట్‌ను పార్లమెంటు ఆమోదించడంతో నేటి రాత్రి నుంచి ఈయూతో ఉన్న అనుబంధానికి అధికారికంగా తెరపడనుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/