ఎట్టకేలకు బ్రెగ్జిట్‌ బిల్లు ఆమోదం

UK parliament
UK parliament

లండన్‌ : ఐరోపా కూటమి నుండి బ్రిటన్‌ అధికారికంగా వైదొలగేందుకు ఉద్దేశించిన బ్రెగ్జిట్‌ బిల్లు ఎట్టకేలకు పార్లమెంట్‌ ఉభయసభల ఆమోదం పొందింది. ఇక రాణి ఎలిజెబెత్‌ ఆమోదముద్ర వేయటం లాంఛన ప్రాయమే. తొలుత దిగువ సభ హౌస్‌ఆఫ్‌ కామన్స్‌ ఆమోదముద్ర పొందిన ఈ బిల్లుకు ఎగువ సభ హౌస్‌ఆఫ్‌ లార్డ్స్‌ కొన్ని సవరణలు ప్రతిపాదిస్తూ వెనక్కి పంపింది. ఈ సవరణలను దిగువ సభ భారీ మెజార్టీతో తిరస్కరించటంతో, స్వల్ప వ్యవధి చర్చ అనంతరం ఈ మెజార్టీ నిర్ణయానికి తలొగ్గిన ఎగువ సభ కూడా తమ ఆమోదముద్ర వేసింది. దీనితో బ్రెగ్జిట్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఉభయసభల ఆమోదం లభించినట్లయింది. ఎగువసభలో ఈ బిల్లుకు ఎటువంటి వ్యతిరేకత వ్యక్తం కాకపోవటంతో ఓటింగ్‌ అవసరం రాలేదు. 2016 జూన్‌లో జరిగిన రిఫరెండంలో బ్రిటన్‌ ప్రజలు బ్రెగ్జిట్‌కు ఓటు వేసిన మూడున్నరేళ్లకు మార్గం సుగమం కావటం విశేషం. బ్రెగ్జిట్‌ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం లభించటంతో ఈ నెల 31వ తేదీన బ్రిటన్‌ ఐరోపా కూటమి నుండి నిష్క్రమించనుంది.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/