30న యాదాద్రి ఆలయంలో ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు రద్దు

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో దర్శనాలు రద్దు..ఆలయ ఈవో గీత

yadadri temple
yadadri temple

హైదరాబాద్‌ః ప్రముఖ ఆలయం యాద్రాద్రిలో ఈ నెల 30న స్వామివారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలను అధికారులు రద్దుచేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం.. ఉదయం సుప్రభాతం నుంచి మధ్యాహ్నం ఆరగింపు వరకు నిర్వహించే ఆర్జిత సేవలు, ప్రత్యేక, ధర్మదర్శనాలను రద్దు చేస్తున్నామని ఆలయ ఈవో గీత చెప్పారు. అదేవిధంగా ఉదయం 9 నుంచి 10 గంటల వరకు బ్రేక్‌ దర్శనాలను కూడా క్యాన్సల్‌ చేస్తున్నామని వెల్లడించారు. నిత్యకైంకర్యాలను ఆంతరంగికంగా నిర్వహిస్తామని తెలిపారు. కాగా, ఇప్పటివరకు యాదాద్రీశ్వరుడిని నలుగురు రాష్ట్రపతులు మాత్రమే దర్శించుకోవడం విశేషం.

కాగా, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము యాదగిరి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వస్తున్నారన్న సమాచారంతో గతంలో యాదగిరీశుడిని దర్శించుకున్న రాష్ట్రపతులపై చర్చ సాగుతున్నది. తొలి రాష్టపతి డాక్టర్‌ రాజేంద్రప్రసాద్‌, 2వ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణణ్‌, 9వ రాష్ట్రపతి డాక్టర్‌ శంకర్‌దయాల్‌శర్మ, 13వ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. తాజాగా 15వ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నారసింహుడిని దర్శించుకోనున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/news/national/