బిగ్‌బాస్‌ రియాల్టీ షో చూపిస్తూ మెదడుకు సర్జరీ సక్సెస్

వైద్యరంగంలో మరో నూతన ప్రయోగం

ఆపరేషన్‌ అనంతరం కోలుకున్న వరప్రసాద్‌తో న్యూరో సర్జన్‌ డాక్టర్‌ హనుమ శ్రీనివాసరెడ్డి, డాక్టర్‌ త్రినాథ్‌

Guntur (Andhra pradesh): నూతన ఆవిష్కరణలతో ఆధునిక వైద్యరంగం ఒకింత కొత్తపుంతలు తొక్కుతోంది.

నవ్యాంధ్రకే మెడికల్‌ హబ్‌గా నిలిచిన గుంటూరులో అరుధైన ఘటన చోటుచేసుకొంది.

రోగి మెలకువుగానే ఉండగా వైద్యులు మెదడుకు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించి అరుధైన ఘనత సాధించారు.

వివరాల్లోకెళితే గుంటూరు జిల్లా, పెదకూరపాడు మండలం, పాటిబండ్ల గ్రామానికి చెందిన 33 ఏళ్ల బత్తుల వరప్రసాద్‌ అనే యువకుడు బెంగళూరులోని సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేస్తున్నాడు.

4 ఏళ్ల క్రితం మెదడులో ట్యూమర్‌ ఏర్పడటంతో అతనికి హైదరాబాద్‌లోని ప్రయివేట్‌ హాస్పిటల్‌ వైద్యులు శస్త్రచికిత్స నిర్వహించి, కణితను తొలగించారు.

అప్పటి నుండి అతను ఆరోగ్యంగా ఉన్నాడు. ఇటీవల 2 నెలల క్రితం అతనికి ఫిట్స్‌ రావడంతో గుంటూరు నగరంలోని బ్రిందా న్యూరో సెంటర్‌కు తరలించారు.

సీనియర్‌ న్యూరో సర్జన్‌ డాక్టర్‌ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి వరప్రసాద్‌కు యం.ఆర్‌.ఐ. పర్‌ఫ్యూజన్‌ స్కాన్‌ను నిర్వహించి మెదడులోని ఫంక్షనల్‌ ఏరియాలో 3 సెంటీమీటర్ల సైజులో కణిత ఏర్పడినట్లు గుర్తించారు.

ఆ కణితి మెడ, కాలు భాగానికి సప్లయిఅయ్యే నరాలు ఉండటంతో అతనికి అవేక్‌బ్రెయిన్‌ సర్జరీ నిర్వహిస్తే ఉపయోగంగా ఉంటుందని నిర్ణయించారు.

రోగికి క్లిష్టమైన ఆపరేషన్‌కు సంబంధించి కౌన్సిలింగ్‌ ఇచ్చి ఆపరేషన్‌కు సిద్ధంచేశారు.

ఈ నెల 10వ తేదీన కేవలం ఆపరేషన్‌చేసే మెదడు ప్రాంతానికే మత్తు మందు ఇచ్చి మిగతా శరీరమంతా స్పృహలో ఉండేటట్లు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

రోగికి బిగ్‌బాస్‌ రియాల్టీషోను ల్యాప్‌ట్యాబ్‌ద్వారా చూపిస్తూ గంటన్నరపాటు ఆపరేషన్‌ నిర్వహించి ఎటువంటి ప్రాణాపాయం లేకుండా సర్జరీని విజయవంతంగా నిర్వహించారు.

ఆపరేషన్‌ జరిగే సమయంలో రోగి కాలు, మెడ కదిలకలను గమనిస్తూ క్లిష్టమైన సర్జరీని వైద్యులు విజయవంతంగా నిర్వహించారు.

ఆపరేషన్‌ అనంతరం వరప్రసాద్‌ ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌లేకుండా పూర్తిస్థాయిలో ఆరోగ్యంగా ఉన్నట్లు డాక్టర్‌ శ్రీనివాసరెడ్డి గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.

ఆపరేషన్‌ నిర్వహించిన వైద్య బృందంలో సీనియర్‌ న్యూరోసర్జన్‌ డాక్టర్‌ డి.శేషాద్రి శేఖర్‌, మత్తు వైద్యులు బొమ్మిశెట్టి త్రినాథ్‌లు సహకరించినట్లు వైద్యులు తెలిపారు.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/