దేవుడికి,రాజకీయాలకు ముడిపెట్టవద్దు

చంద్రబాబుకు అవేవీ లేవని విమర్శలు

botsa satyanarayana
botsa satyanarayana

అమరావతి: అంతేర్వేది ఘటనపై ఏపి మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. అంతర్వేది ఘటనపై ఆందోళన చేసిన వారిని, ప్రార్థనా మందిరాలపై రాళ్లు వేసిన వారిని విడుదల చేయాలంటూ ఓ జాతీయపార్టీ ధర్నాలు చేస్తోందని అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అక్కర్లేదా? లేకపోతే ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారా? అని ప్రశ్నించారు. అధికారంలో ఎవరున్నప్పటికీ బాధ్యతగా ప్రవర్తించాల్సిన అవసరం ఉందని, రాజకీయ పార్టీ అంటే అవాకులు చెవాకులు మాట్లాడ్డానికి, ఇతరులపై బురద చల్లడానికి ఉద్దేశించింది కాదని హితవు పలికారు. ఓ విధానం ప్రకారం, ఓ సిద్ధాంతం ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా బొత్స టిడిపి ధినేత చంద్రబాబుపైనా విమర్శలు చేశారు.

చంద్రబాబుకు ఇలాంటి సిద్ధాంతాలు, విధానాలు ఏవీ లేవని, అవసరమైతే కాళ్లు, గడ్డాలు పట్టుకుంటారని, లేకపోతే తిట్టిస్తారని విమర్శించారు. మతానికి, దేవుడికి, రాజకీయాలకు ముడిపెట్టే ఇలాంటి చర్యలను, ఆలోచనా విధానాన్ని ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. ఇదొక దుష్ట సంప్రదాయం అని అన్నారు. రాజకీయ పార్టీగా నిరసన తెలియజేసే హక్కు ఉందని, దాని ప్రకారం నడుచుకోవాలని తెలిపారు. అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణ కోరామని, ఏదైనా సంఘటన జరిగితే ఈ సంఘటన వెంటనే విచారణకు ఆదేశిస్తున్నామని తెలిపారు. అంతర్వేదిలో రథం కాలిపోయిందా, లేక కాల్చారా అనేది సీబీఐ విచారణలో తేలుతుందని బొత్స స్పష్టం చేశారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/