రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేదు : బొత్స

అనుమానాలుంటే గ్రామాల్లోకి వెళ్దాం రండి .. బొత్స సత్యనారాయణ

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి, ఎన్టీపీసీకి మధ్య కొంత గ్యాప్ వచ్చిన సంగతి నిజమేనని… అయితే సమస్య అయిపోయిన తర్వాత కూడా భూతద్దంలో చూపిస్తూ మాట్లాడటం సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సమస్యలన్నింటినీ పరిష్కరించుకుంటామని చెప్పారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని… రాష్ట్రంలో ప్రస్తుతం విద్యుత్ సమస్య లేదని అన్నారు. కావాలంటే గ్రామాల్లోకి వెళదాం రండని చెప్పారు. సీఎం జగన్ చిన్నాన్న వైయస్ వివేకా హత్యకేసులో కూడా రాద్ధాంతం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. హత్యకు సంబంధం లేని పేర్ల గురించి మాట్లాడుతూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కోసమే చెత్తపై రోజుకు రూపాయి, రెండ్రూపాయలు వసూలు చేస్తున్నామని… కానీ, ప్రజలను దోచుకుతింటున్నట్టు కొన్ని పత్రికలు పనికట్టుకుని ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు.

జగనన్న ఇళ్ల నిర్మాణాలకు రూ. 5 లక్షలు ఇస్తామని తామ ఎక్కడా చెప్పలేదని బొత్స అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఇంటి స్థలం, నిర్మాణానికి డబ్బులు ఇస్తామని మాత్రమే చెప్పామని తెలిపారు. రాజకీయ అవసరాల కోసం కొన్ని మాటలు మాట్లాడితే తప్పులేదని… కానీ ఉన్నవి, లేనివి మాట్లాడటం సరికాదని అన్నారు. జగనన్న ఇళ్ల నిర్మాణంలో రాజీ పడకూడదని జగన్ చెప్పారని తెలిపారు. ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నా, ఏదోఒకలా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పీఆర్సీ విషయంలో కూడా ఏదో జరిగిపోతుందని టీడీపీ నేతలు భావించారని… కానీ ఉద్యోగులు వారి తప్పును తెలుసుకున్నారని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/