వాస్తవాలు తెలుసుకోకుండా పవన్‌ మాట్లాడుతున్నాడు – బొత్స ఫైర్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడని మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేసారు. జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు కార్యక్రమంలో భాగంగా ఆదివారం విజయనగరం జిల్లా గుంకలాంలో పవన్ కళ్యాణ్ పర్యటించారు. అక్కడ ఇళ్లను పరిశీలించిన పవన్..వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై నిప్పులు చెరిగారు. వైస్సార్సీపీ అవినీతికి చిరునామాగా మారిందని , జగనన్న కాలనీ ఇళ్లు ఎప్పుడు నిర్మిస్తారో చెప్పాలని నిలదీశారు. ఇళ్ల నిర్మాణం పేరుతో రూ.12 వేల కోట్ల అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు.

ఈ ఆరోపణల ఫై మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ నోటికొచ్చిన‌ట్లు మాట్లాడితే ప్ర‌జ‌లు న‌మ్ముతారా? ఆయ‌నేమైనా యుగపురుషుడివా..? అని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌శ్నించారు. పేద‌ల ఇళ్ల‌పై వాస్త‌వాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నార‌ని మండిప‌డ్డారు. ఆయ‌న గురించి ప్ర‌ధానికి ఫిర్యాదు చేయాల్సిన అవ‌స‌రం లేద‌ని, జ‌న‌సేన అస‌లు రాజ‌కీయ పార్టీ కాద‌ని, అది సెల‌బ్రిటీ పార్టీ అని అభివ‌ర్ణించారు.

గుడిసెలు లేని రాష్ట్రంగా ఉండాలని, అందరికీ పక్కా ఇళ్లు ఉండాలని, వారికి సొంతింటి హక్కు కల్పించాలని దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ఒక యజ్ఞం చేశారు. వైయస్‌ఆర్‌ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో ఒక ప్రణాళిక బద్ధంగా, పారదర్శకంగా ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ తరువాత వైయస్‌ఆర్‌ తనయుడు జగన్‌.. తండ్రి ఆలోచన, స్ఫూర్తితో చెప్పిన మాటకు కట్టుబడి ఇళ్లు లేని నిరుపేదలకు శాశ్వత ప్రాతిపదికన ఇళ్లు ఇవ్వాలనే ఆలోచనతో జగనన్న కాలనీల పేరిట ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని చేపట్టారని బొత్స అన్నారు. జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణం పెద్ద ఎత్తున జరుగుతుంది. నిర్దిష్టమైన ప్రణాళిక ఉంటేనే కార్యక్రమం వేగంగా ముందుకెళ్తుంది. నిస్వార్థంగా, కమిట్‌మెంట్‌తో పేదలకు శాశ్వత ఇళ్లు ఉండాలి. వారు సగర్వంగా సమాజంలో తిరగాలని ఈ కార్యక్రమాన్ని తలపెట్టాం. ఇందులో ఏ విధమైన ఒడిదుడుకులు, అభిప్రాయ భేదం ఏమీ లేదు. అంతా పారదర్శకంగా జరుగుతుందని బొత్స అన్నారు.

సెలబ్రెటీ పార్టీ నాయకుడు పవన్‌ విజయనగరం వెళ్లాడు. జనసేనను రాజకీయ పార్టీగా అనుకోవడం లేదు. ఎందుకంటే రాజకీయ పార్టీకి ఒక విధానం, కార్యాచరణ ఉంటుంది. పవన్‌ మాట, భాషలో సుమారు 15 వేల కోట్ల అవినీతి జరిగిపోయిందని మాట్లాడారు. ఖర్చు చేసిందే అంత సొమ్ములేదు.. ఏరకంగా అవినీతి జరిగిపోయింది..? భూసేకరణకు, మౌలిక సదుపాయాలకు కేటాయించిన రూ.15 వేల కోట్లను తినేసినట్టా..? ఏదిపడితే అది మాట్లాడితే నమ్మడానికి ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా..? అని బొత్స ప్రశ్నించారు.