బ్రిటన్ తదుపరి ప్రధాని రేసులో రిషి సునక్‌

rishi-sunak
rishi-sunak

లండన్‌ః వరుస వివాదాల నేపథ్యంలో ఎట్టకేలకు బ్రిటన్​ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన పదవికి ఎట్టకేలకు రాజీనామా చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘన, ఓ రేపిస్టు ఎంపీని కీలక పదవిలో నియమించటం ఆరోపణలతో కొద్దిరోజులుగా బోరిస్‌ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ప్రధాని పదవి నుంచి బోరిస్‌ దిగిపోవాలంటూ సొంత ప్రభుత్వంలోని మంత్రులే వరుసగా రాజీనామాలు చేయటంతో సంక్షోభం మరింత ముదిరింది. దీంతో గురువారం ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఆయన వారసుడిని వచ్చే అక్టోబర్‌లో ఎన్నుకొంటారు. అప్పటివరకు బోరిస్‌ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. బ్రిటన్‌ కొత్త ప్రధాని రేసులో భారత సంతతికి చెందిన రిషి సునక్‌ ముందు వరుసలో ఉన్నారు. ఒకవేళ ఇదే జరిగితే.. బ్రిటన్​ ప్రధాని పదవి చేపట్టిన తొలి భారత సంతతి వ్యక్తిగా సునాక్​ నిలుస్తారు. ఈయన ఇన్ఫోసిస్‌ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు.

కాగా, రిషి సునాక్​ 1980 మే 12న ఇంగ్లాండ్​లోని సౌథాంప్టన్​లో జన్మించారు. వీరి పూర్వీకులది భారత్​లోని పంజాబ్​. వీరు తొలుత తూర్పు ఆఫ్రికాకు వలస వెళ్లి.. అక్కడి నుంచి పిల్లలతో సహా యూకేకు వెళ్లి స్థిరపడ్డారు. అక్కడే రిషి తల్లిదండ్రులు కలిశారు. రిషి బాల్యం మొత్తం ఇంగ్లాండ్​లోనే గడిచింది. తొలుత వించెస్టర్​ కళాశాలలో, తర్వాత ఆక్స్​ఫర్డ్​ లింకన్​ కాలేజ్​లో ఫిలాసఫీ, పాలిటిక్స్​, ఎకనామిక్స్​ చదివారు. తర్వాత ఎంబీఏ కోసం కాలిఫోర్నియా స్టాన్​ఫోర్డ్​ యూనివర్సిటీలో చేరారు. అక్కడే ​ఇన్ఫోసిస్​ వ్యవస్థాపకులు నారాయణ మూర్తి కుమార్తె అక్షతా మూర్తితో పరిచయం ఏర్పడింది. అది ప్రేమగా మారి.. 2009లో వీరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/