రిషి సునక్‌ వద్దు మరెవరినైనా ఎన్ను కోవాలి: మద్దతుదారులతో బోరిస్

రిషి ద్రోహం చేశాడన్న భావనలో బోరిస్ ఉన్నారంటూ ‘ద టైమ్స్’ కథనం

boris johnson
boris johnson

లండన్‌ః బ్రిటన్‌ ప్రధాని ఎన్నికలో మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్‌ను ఎలాగైనా ఓటమిపాలు చేయాలని తాత్కాలిక ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ అంతర్గతంగా ప్రచారం చేస్తున్నట్టు సమాచారం. సునాక్‌ను తప్ప.. మరెవరినైనా బలపరచండని తన వర్గం ఎంపీలకు జాన్సన్‌ సూచించినట్టు తెలుస్తోంది. రిషి తనకు ద్రోహం చేశాడని, ఆయన వల్లే సొంత పార్టీ నేతలు కూడా తనకు దూరమయ్యారని బోరిస్ ఆగ్రహంతో ఉన్నారని చెబుతున్నారు.

తదుపరి ప్రధానిగా ఎవరు ఉండాలన్న విషయంలో తాను తలదూర్చబోనని జాన్సన్ చెప్పినప్పటికీ, రిషి మాత్రం ప్రధాని కాకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా ఆయన పావులు కదుపుతున్నారని ‘ద టైమ్స్’ ఓ కథనంలో పేర్కొంది. సునక్‌ను కాకుండా విదేశాంగమంత్రి లిజ్ ట్రస్ కానీ, లేదంటే జాకబ్ రీస్, డోరిస్, పెన్నీ మోర్డాంట్‌లలో ఎవరో ఒకరికి మద్దతునివ్వాలని అంతర్గతంగా ప్రచారం చేస్తున్నట్టు ఆ కథనం పేర్కొంది.

10 డౌనింగ్ స్ట్రీట్ రిషిని వ్యక్తిగతంగా ద్వేషిస్తోందని, బోరిస్‌ను పదవి నుంచి తప్పించేందుకు కొన్ని నెలలుగా రిషి ప్రయత్నిస్తున్నట్టు డౌనింగ్ స్ట్రీట్ భావిస్తోందని ఆ కథనం వివరించింది. అయితే, ఇది తప్పుడు కథనమని, ఈ ప్రచారంలో వాస్తవం లేదని బోరిస్ సన్నిహితుడొకరు తెలిపారు. రిషిని ఓడించేందుకు జాన్సన్ ప్రయత్నిస్తున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదన్న ఆయన.. రిషి తనకు ద్రోహం చేశాడని మాత్రం బోరిస్ భావిస్తున్నారని పేర్కొన్నారు.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/movies/