స్కూల్‌లో వేసిన భోగి మంటల్లో అపశృతి…ముగ్గురు విద్యార్థులకు గాయాలు

స్కూల్‌లో వేసిన భోగి మంటల్లో అపశృతి చోటుచేసుకుంది.ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన కోనసీమ జిల్లా అమలాపురం పరిధిలోని గొల్లవిల్లిలో ప్రైవేట్ పాఠశాల ‘విజ్‌డమ్’లో చోటుచేసుకుంది. సంక్రాంతి సంబరాల్లో భాగంగా బుధవారం (జనవరి 11) సాయంత్రం గొల్లవిల్లిలో ప్రైవేట్ పాఠశాల ఆవరణ లో భోగి మంటలు వేశారు.

ఈ క్రమంలో విద్యార్థులందరూ ఆ మంటల చుట్టూ చేరి కేరింతలు కొడుతుండగా.. సిబ్బంది ఆ మంటలపై పెట్రోలు చల్లడం తో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడి ముగ్గురు విద్యార్థులకు వ్యాపించాయి. దీంతో ముగ్గురు విద్యార్థులకు గాయాలు అయ్యాయి. కాలిన గాయాలతో పిల్లలు తల్లడిల్లిపోయారు. ఈ ఘటనలో రెండో తరగతి, మూడో తరగతికి చెందిన ఇద్దరు బాలికలు, యూకేజీకి చెందిన బాలుడు గాయపడ్డారు. వీరిని అమలాపురంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇద్దరు విద్యార్థులకు పొట్ట భాగంలో, కాలిపై గాయాలయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రాణాలకు ప్రమాదం ఏమీ లేదని తెలుపడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు.