నగరంలో మొదలైన బోనాల సంబరాలు

ఆషాఢమాసం బోనాల ఉత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలో బోనాల సంబరాలు మొదలయ్యాయి. గోల్కొండ శ్రీ శ్రీ జగదాంబిక మహంకాళీ గోల్కొండ బోనాల ఉత్సవాల నిర్వాహకుల ఆధ్వర్యంలో ఆదివారం లంగర్‌హౌజ్‌ చౌరస్తాలో ప్రారంభమయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం తరఫున స్పీకర్ గడ్డం ప్రసాద్ , మంత్రులు కొండ సురేఖ , పొన్నం ప్రభాకర్ , మేయర్ గద్వాల్ విజయలక్ష్మి , డెప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి , ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ , ప్రిన్సిపాల్ సెక్రెటరీ శైలజ , కలెక్టర్ అనుదీప్ లు బోనాలను అధికారికంగా ప్రారంభించారు.

అనంతరం అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు. అక్కడి నుంచి పట్టు వస్త్రాల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు గొల్కొండ కోట వరకు కొనసాగాయి. 9 వారాల పాటు బోనాల ఉత్సవాలు జరుగుతాయి. గోల్కొండ కోటలోనే బోనాలు ముగిస్తాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు దేశ, విదేశాల సందర్శకులు తరలివస్తారు. ప్రతి ఆదివారం, గురువారం జగదాంబిక అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. శనివారం గోల్కొండ కోట బోనాల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభుత్వం తరపున 11 లక్షల రూపాయల చెక్కును మంత్రులు పొన్నం ప్రభాకర్‌, కొండా సురేఖ గోల్కొండ ఈవో శ్రీనివాస్‌రాజు, ఉత్సవ కమిటీ సభ్యులకు అందజేశారు.