వరవరరావుకు బెయిల్‌ మంజూరు

షరతులతో కూడిన బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తి

ముంబయి: గోరేగావ్ కుట్ర కేసులో అరెస్ట్ అయి, దాదాపు ఏడాది కాలంగా జైలు జీవితాన్ని గడుపుతున్న ప్రముఖ రచయిత, విరసం నేత వరవరరావుకు ముంబయి హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. ఆయన అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేస్తున్నట్టు ఈ సందర్భంగా న్యాయమూర్తి పేర్కొన్నారు. తనపై ఆరోపణలు ఉన్న కేసు విచారణకు సంబంధించి, పోలీసులకు సహకరించాలని, సాక్ష్యాల తారుమారుకు ప్రయత్నిస్తే, బెయిల్ ను రద్దు చేస్తామని ఈ సందర్భంగా న్యాయమూర్తి వరవరరావును హెచ్చరించారు. నేటి సాయంత్రం లోగా బెయిల్ పేపర్లను జైలు అధికారులకు అందించి, విడుదలయ్యేలా చూస్తామని ఆయన తరఫు న్యాయవాదులు వెల్లడించారు.


కాగా, వ‌ర‌వ‌ర‌రావుకు బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం.. ఈ ఆరు నెల‌ల కాలంలో ఆయ‌న ముంబయి న‌గ‌రాన్ని వీడి బ‌య‌టికి వెళ్ల‌రాద‌ని ఆదేశించింది. అదేవిధంగా కేసు విచార‌ణ‌కు సంబంధించి ఎలాంటి బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేయ‌రాద‌ని, కేసులో స‌హ‌నిందితులుగా ఉన్న‌వారితో మాట్లాడ‌వ‌ద్ద‌ని సూచించింది. ఒక‌వేళ‌ ఆరు నెల‌ల త‌ర్వాత ఆరోగ్యం మెరుగుప‌డ‌క‌పోతే బెయిల్ పొడిగింపు కోసం మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని కోర్టు పేర్కొన్న‌ది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/