శంషాబాద్ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు కాల్‌

విమానం ఎక్కనివ్వలేదని.. బాంబు బెదిరింపు

Shamshabad Airport
Shamshabad Airport

హైదరాబాద్ః హైదరాబాద్ శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈరోజు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. హైదరాబాద్ – చెన్నై విమానంలో బాంబు పెట్టామంటూ ఓ దుండగుడు ఫోన్ చేశాడు. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది. అప్రమత్తమైన ఎయిర్ పోర్టు అధికారులు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనిఖీలను నిర్వహించారు. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువును గుర్తించలేదని అధికారులు తెలిపారు. మరోవైపు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి ఎయిర్ పోర్టులోనే ఉన్నట్టు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. చెన్నైలో సీనియర్ ఇంజినీర్ గా పని చేస్తున్న అజ్మీరా భద్రయ్య అనే వ్యక్తి ఈ కాల్ చేసినట్టు గుర్తించారు. విమానాశ్రయానికి ఆయన లేట్ గా రావడంతో ఆయనను ఎయిర్ లైన్స్ సిబ్బంది అనుమతించలేదు. దీంతో, ఆయన ఈ బెదిరింపు కాల్ చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆయనను అదుపులోకి తీసుకున్నారు.