కేరళలోని ఆర్​ఎస్​ఎస్​ కార్యాలయంపై బాంబు దాడి

కిటికీలు, తలుపులు ధ్వంసం

bomb-hurled-at-rss-office-in-kerala-kannur-district

తిరువనంతపురంః కేరళలోని కన్నూర్​ జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. కేరళలో రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ కార్యాలయంపై బాంబు దాడి జరిగింది. కన్నూర్‌ జిల్లా పయ్యన్నూర్‌లోని కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో జరిగింది. దాడి జరిగిన సమయంలో కార్యాలయంలో కార్యకర్తలు ఉన్నారని.. కానీ గాయాలు కాకుండా తప్పించుకున్నారని పోలీసుల తెలిపారు. ఈ దాడిలో కార్యాలయ కిటికీలు, అద్దాలు, తలుపులు ధ్వంసం అయ్యాయి. అయితే, దాడికి గల కారణాలు తెలియరాలేదు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నామని, ఇందులో భాగంగా సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

అయితే, సీపీఐ (ఎం) కార్యకర్తలో దాడికి పాల్పడ్డారని ఆర్‌ఎస్‌ఎస్‌ ఆరోపించింది. గత నెల 30న రాత్రి ఏకేజీ సెంటర్‌ వద్ద సీపీఐ (ఎం) రాష్ట్ర ప్రధాన కార్యాలయం బాంబు దాడి జరిగింది. రాత్రి 11:30 గంటల సమయంలో ద్విచక్రవాహనంపైన వచ్చిన ఓ వ్యక్తి.. సీపీఎం ప్రధాన కార్యాలయం గేటుపై బాంబు విసిరి పరారయ్యాడు. ఈ దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాకు చిక్కాయి. ఆ తర్వాత దీంతో కేరళలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటి వరకు నిందితుడిని మాత్రం పట్టుకోలేకపోయారు. ఇంతకు ముందు వయనాడ్‌లోని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ కార్యాలయంపై దాడి ఘటన చోటు చేసుకున్నది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/