పాకిస్థాన్‌లో బాంబు పేలుడు..ఏడుగురు మృతి

Bomb-Explodes
Bomb-Explodes


క్వెట్టా : పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రాంతంలో క్వెట్టా పట్టణంలో ఉన్న ప్రెస్‌క్లబ్‌ సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఏడుగురు మృతిచెందగా, 21 మందికి గాయాలయ్యాయని అక్కడి ప్రభుత్వ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. క్వెట్టా డిఐజి అబ్ధుల్‌ రజాక్‌ మాట్లాడుతూ ఈ ఘటనను అత్మాహుతి దాడిగా అనుమానిస్తున్నామన్నారు. ప్రెస్‌క్లబ్‌ సమీపంలో ఒక ఆందోళన జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి సమీపంలోని పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై 24 గంటల్లోగా నివేదిక సమర్పించాలని బలూచిస్థాన్‌ ముఖ్యమంత్రి జమ్‌ కమల్‌ ఖాన్‌ ఐజిపిని ఆదేశించారు. పేలుడు గురించి తెలుసుకున్న పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ విచారం వ్యక్తం చేసినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఈ ఘటనను బలూచిస్తాన్‌ గవర్నర్‌ అమానుల్లా ఖాన్‌ ఖండించారు. ఇటువంటి దాడులు దేశ, భద్రతా బలగాల విశ్వాసాన్ని బలహీనం చేయలేవని పేర్కొన్నారు. ఉగ్రవాదుల ప్రణాళికలపై నిఘా ఉంచి వారిని నిలువరించాల్సిన అవసరం ఉందని అన్నారు.

తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/